అహ్మదాబాద్, ఆగస్టు 4: యువభారతాన్ని పీల్చిపిప్పి చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, చాపకింద నీరులా డ్రగ్స్ మాఫియా అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నది. డ్రగ్స్ సరఫరాకు పోర్టులు కల్పవృక్షాలుగా మారడం, దేశంలోని మెజారిటీ పోర్టులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉండటం ఈ మాఫియాకు కలిసొస్తున్నది. గడిచిన రెండేండ్ల ఉదంతాలను పరిశీలిస్తే.. గుజరాత్లో అదానీకి చెందిన ముంద్రా పోర్టులోనే మూడు సార్లు మాదకద్రవ్యాలు భారీయెత్తున పట్టుబడ్డాయి. ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడినప్పటికీ, అక్కడి పోర్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం.. వారిపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్రంలోని మోదీ సర్కారుగానీ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
నిర్లక్ష్యపూరిత సమాధానాలు
కిందటేడాది సెప్టెంబర్‌లో రూ.21,000 కోట్లకు పైగా విలువైన దాదాపు 3వేల కిలోల హెరాయిన్‌ను అధికారులు ముంద్రా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్నారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం అదే తొలిసారి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దయెత్తున చర్చ జరిగింది. ఆ స్థాయిలో డ్రగ్స్ ఉన్న కంటైనర్‌ను పోర్టులోకి ఎలా అనుమతించారని, చెకింగ్ వ్యవస్థ లేదా? అంటూ అదానీ పోర్టుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. దీనిపై అదానీ పోర్ట్స్ఎస్ఈజడ్ (ఏపీఎస్‌ఈజడ్) స్పందించింది. తమ పోర్ట్ అధికారులకు పోలీసింగ్ అధికారాలు లేవని, అందుకే కంటైనర్లలో ఏముందో చెక్ చేయలేమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చే కంటైనర్లకు దూరంగా ఉంటామని బాహాటంగా ప్రకటించింది. దీంతో డ్రగ్ సరఫరాదారులు తమ కంటైనర్లపై ఆయా దేశాల ట్యాగ్‌ను తీసేసి ఇతర దేశాల ట్యాగ్లు తగిలించడం మొదలెట్టారు. ఈ అడ్వైజరీ తర్వాత యూఏఈ నుంచి వచ్చినట్టు చెబుతున్న రెండు కంటైనర్లలో డ్రగ్స్‌ను ముంద్రా పోర్టులోనే అధికారులు గుర్తించారు.
హెచ్చరించినా పట్టించుకోలే..
ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ సిటీ నుంచి జూన్ 2021లో ముంద్రా పోర్టుకు ఓ కంటైనర్ కార్గో వచ్చింది. దీనిపై భారత కస్టవ్ డిపార్ట్మెంట్కు చెందిన నేషనల్ కార్గో ట్రాకింగ్ సిస్టవ్‌ు.. ముందుగానే పోర్టు అధికారులను హెచ్చరించింది. కానీ, వీటిని పట్టించుకోకుండా కార్గోకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దీనికి సంబంధించి పోర్టులోని కొందరు అధికారులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తున్నది. ఈ కంటైనర్‌లో 300 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీన్ని ఢిల్లీలోని అలీపూర్కు తరలించాలనుకున్నారు. అయితే, ఎట్టకేలకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఈ కుట్రను భగ్నం చేసింది. 2022 జూలైలో పోర్టు వెలుపల ఉన్న కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ నుంచి 75 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కంటైనర్ వచ్చి అప్పటికే రెండు నెలలు దాటింది. అయితే ఆ సరుకును ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో దాన్ని అలాగే నిల్వచేసినట్టు పోర్టు అధికారులు పేర్కొనడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. పోర్టు అధికారులు, కంప్యూటర్ ఎనాలిసిస్ బిల్లు చూశాకే కస్టమ్స్ అధికారులు కంటైనర్లను అనుమతిస్తారని, కంటైనర్‌లో ఏమున్నదో చూడాల్సిన బాధ్యత పోర్టు అధికారులపైనే ఉంటుందని ఓ ప్రభుత్వాధికారి పేర్కొన్నారు.
డ్రగ్ మాఫియాకు అండగా డబుల్ ఇంజిన్ సర్కార్
అదానీకి చెందిన ముంద్రా పోర్టుపై సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఒకే పోర్టులో స్వల్పకాల వ్యవధిలో మూడుసార్లు మాదక ద్రవ్యాలు పట్టుబడినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అదానీ పోర్టు నుంచే మాదక ద్రవ్యాలు నిరంతరం ఎలా వస్తున్నాయంటూ సందేహాలు వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని డబుల్ ఇంజిన్ సర్కార్ డ్రగ్ మాఫియాకు అండగా నిలుస్తున్నదని దుయ్యబట్టారు.
13 ప్రధాన పోర్టులు అదానీవే
దేశంలోని మొత్తం పోర్టుల్లో 24 శాతం పోర్టులను అదానీ గ్రూపే నడిపిస్తున్నది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని 13 మేజర్ పోర్టులు తమ ఆధీనంలోనే ఉన్నట్టు వివరించింది. జాబితాలో ముంద్రా, తునా, దహేజ్, హజీరా (గుజరాత్), దిఘీ (మహారాష్ట్ర), ముర్ముగోవా (గోవా), విజింజామ్ (కేరళ), ఎన్నూర్, కట్టుపల్లి (తమిళనాడు), కృష్ణపట్నం, విశాఖపట్నం, గంగవరం (ఆంధ్రప్రదేశ్), దామ్రా (ఒడిశా) పోర్టులు ఉన్నాయి.
ముంబైలో రూ. 1,400 కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్ పట్టివేత
మహారాష్ట్ర రాజధాని ముంబైలో 700 కిలోల సింథటిక్ డ్రగ్ మెఫెడ్రోన్‌ను పోలీసులు పట్టుకొన్నారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. 1,400 కోట్లు ఉంటుందని తెలిపారు. గడిచిన ఏడాదిలో ఈ స్థాయిలో మెఫెడ్రోన్ డ్రగ్ దొరకడం ఇదే తొలిసారని వెల్లడించారు. ఐదుగురిని అరెస్టు చేసినట్టు వివరించారు. నిందితుల్లో ఒకడు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఉన్నట్టు అధికారులు తెలిపారు.