అహ్మదాబాద్: సంఘటితంగా కొనుగోళ్లు చేస్తే టాప్ బ్రాండ్లు కూడా దిగి వస్తాయని గుజరాతీలు నిరూపించారు. దాని వల్ల కలిసికట్టుగా బేరమాడే సత్తా పెరుగుతుందని, డిస్కౌంట్ల నజరానా సొంతమవుతుందని రుజువు చేశారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జేఐటీఓ) కింద దేశవ్యాప్తంగా జైనులు ఇటీవల 186 విలాసవంతమైన కార్లను కొన్నారు. వీటిలో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, మరో 12 ఇతర టాప్ బ్రాండ్ల కార్లు ఉన్నాయి. వీటి విలువ రూ.149.5 కోట్లు, అయితే ఉమ్మడిగా కొనడం వల్ల వీరికి రూ.21 కోట్లు ఆదా అయింది.
జేఐటీఓ అపెక్స్ ఉపాధ్యక్షుడు హిమాంశు షా మాట్లాడుతూ, సామూహికంగా కొనుగోలు చేయడం వల్ల బ్రాండ్లతో బేరమాడే శక్తి వస్తుందని చెప్పారు. జేఐటీఓలో దేశవ్యాప్తంగా 65,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘం సామూహిక కొనుగోళ్లను ఎలక్ట్రానిక్స్, మందులు, ఆభరణాలు, మరికొన్ని వస్తువులకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది. జైనుల మాదిరిగానే పశువుల కాపరులైన భార్వాడ్ తెగవారు కూడా సామూహిక కొనుగోళ్లను ప్రారంభించారు. భార్వాడ్ యువ సంఘటన్ ఇటీవలే 121 జేసీబీలకు ఆర్డర్ ఇచ్చింది.మొత్తం మీద వీరికి రూ.4 కోట్లు ఆదా అయింది.