అహ్మదాబాద్: ఐపీఎస్ అధికారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. (Congress MLA claims threat to life) బాబా సిద్ధిఖీ మాదిరిగా తాను లేదా తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా హత్యకు గురైతే ఆ ఐపీఎస్ అధికారిదే బాధ్యత అని పేర్కొన్నారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ బుధవారం కేంద్ర మంత్రి అమిత్ షాకు ఈ మేరకు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) రాజ్‌కుమార్ పాండియన్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆయన ఆరోపించారు. దళితులపై అక్రమ ఆక్రమణల కేసుపై చర్చించేందుకు అక్టోబర్ 15న పాండియన్ కార్యాలయానికి తాము వెళ్లినట్లు తెలిపారు.
కాగా, తమ మొబైల్ ఫోన్లు బయట ఉంచాలని ఆయన అన్నారని, తాను టీ షర్టు ధరించడాన్ని ప్రశ్నించడంతోపాటు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఆరోపించారు. అలాగే సమావేశాన్ని అకస్మాత్తుగా ముగించడంతోపాటు మళ్లీ ఎప్పుడూ కూడా తన వద్దకు రావద్దంటూ ఎమ్మెల్యే అయిన తనతో పాండియన్ దరుసుగా ప్రవర్తించినట్లు విమర్శించారు. ‘బాబా సిద్ధిఖీలా నేను, నా కుటుంబ సభ్యులు లేదా నా టీమ్‌లోని ఎవరైనా హత్యకు గురైతే, దానికి కేవలం ఐపీఎస్ అధికారి రాజ్‌కుమార్ పాండియన్ మాత్రమే బాధ్యత వహిస్తారు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ఏడేళ్లు జైలులో ఉన్న ఆ అధికారి పాత్ర ఏంటో గుజరాత్ రాష్ట్రం మొత్తానికి తెలుసని ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ విమర్శించారు. ఏం జరిగినా సరే గుజరాత్‌తోపాటు దేశంలోని దళితులు, వెనుకబడిన తరగతులు, బహుజనుల గౌరవం, ఆత్మగౌరవం కోసం తాను ఎప్పటికీ పోరాడతానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.