గాంధీనగర్: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు సీఎం భూపేంద్ర పటేల్ మంగళవారం ప్రకటించారు. రాష్ట్రంలో యూసీసీ అవసరం అంచనావేయడానికి, ముసాయిదా బిల్లును రూపొందించటానికి ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసినట్టు సీఎం వెల్లడించారు. కమిటీ తన నివేదికను 45 రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తుందని చెప్పారు.
కుంభమేళా మృతుల సంఖ్య ఎందుకు దాస్తున్నారు?
న్యూఢిల్లీ: మహా కుంభమేళా మృతుల సంఖ్యను డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు దాస్తున్నదని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. జనవరి 29నాటి ఘటనలో వాస్తవాలు బయటపెట్టడం లేదని ఆయన ఆరోపించారు. కుంభమేళా నిర్వహణ ఆర్మీకి అప్పగించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనపై వివరాలన్నీ పార్లమెంట్ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
కుంభ్ తొక్కిసలాట మృతులు 2 వేల మంది: రౌత్
న్యూఢిల్లీ: మహా కుంభమేళా తొక్కిసలాటలో 2,000 మంది మరణించారని ప్రకటించి శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం రాజ్యసభలో అలజడి సృష్టించారు. దీంతో తన ప్రకటనకు తగిన ఆధారాలు చూపాలని రౌత్‌ని రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ హరివంశ్ ఆదేశించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా, అధికారిక లెక్కలను రౌత్ ప్రశ్నించారు. రౌత్ వ్యాఖ్యలపై అధికార పక్షం నిరసన వ్యక్తం చేసింది.