Lucky Car | అమ్రేలి, నవంబర్ 8: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఓ రైతు కుటుంబం తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. సాధువులు, ఆధ్యాత్మిక గురువులు సహా 1,500 మంది ప్రజల సమక్షంలో సంజయ్ పోలారా కుటుంబం పదర్‌షింగా గ్రామంలోని తమ పొలంలో గురువారం హిందూ సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించింది. మొదట 12 ఏండ్ల పాటు వాడిన వాగన్ ఆర్ కారును పూలతో అలంకరించి ఇంటి నుంచి పొలం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత పొలారా కుటుంబం వేద మంత్రోచ్ఛారణల నడుమ కారును15 అడుగుల గోతిలో పూడ్చి పెట్టారు.
సూరత్‌లో నిర్మాణ వ్యాపారం చేసే పొలారా తమ కుటుంబానికి అదృష్టాన్ని తీసుకొచ్చిన కారు కోసం ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నారు. తద్వారా భవిష్యత్తు తరాలు ఆ కారును గుర్తుంచుకొంటాయని భావించారు. ఇందుకోసం తన కారుకు రూ.4 లక్షలు ఖర్చు చేసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ‘ఈ కారు మాకు సంపద తీసుకొచ్చింది. దీని వల్ల వ్యాపారంలో విజయం లభించింది. మా కుటుంబానికి గౌరవం వచ్చింది. అందుకే దీన్ని అమ్మడం కన్నా, దీనికి సమాధిని నిర్మించడం ద్వారా నివాళి అర్పించాను’ అని పొలారా తెలిపారు.