న్యూఢిల్లీ : బుల్డోజర్ కూల్చివేతలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. ఏదో ఓ మతానికి కాకుండా ప్రజలందరికీ వర్తించే విధంగా ఈ మార్గదర్శకాలు ఉంటాయని తెలిపింది. ఓ వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉండటం కానీ, దోషిగా నిర్ధారణ కావడం కానీ, ఆ వ్యక్తి ఇంటిని కూల్చేయడానికి తగిన కారణం కాబోదని స్పష్టం చేసింది. అయితే, ఆక్రమణదారులను రక్షించే విధంగా ఈ మార్గదర్శకాలు ఉండబోవని వివరించింది. గుడులు, గురుద్వారాలు, దర్గాలు వంటి మతపరమైన కట్టడాలు ప్రజలకు ఆటంకం కలిగించే విధంగా రోడ్లు, జలాశయాలు, రైలు మార్గాలు వంటివాటిపై ఉండకూడదని వివరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసింది.