న్యూఢిల్లీ: బీడీలపై ఉన్న జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చౌకైన బీడీల వల్ల వాటి వినియోగం పెరుగుతుందని.. ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల్లో ఇది పెరిగి దేశ పొగాకు సంబంధిత అనారోగ్య భారాన్ని పెంచుతాయని వారు తెలిపారు. బీడీల వినియోగం పెరగడం క్యాన్సర్లు, ఇతర వ్యాధులకు దారి తీస్తుందని పొగాకు వాడకం నియంత్రణకు కృషి చేస్తున్న డాక్టర్ విశాల్ రావు తెలిపారు.
వాటి ధర తగ్గించడమంటే చావుకు రాయితీ ఇవ్వడమేనని అన్నారు. మిగతా పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీని విధించి, బీడీలపై తగ్గించడం సరి కాదని.. పొగాకు ఉత్పత్తులపై పన్నుల్లో ఏకరూపతను తీసుకురావాలని ఆయన కోరారు. ఎక్కువ పన్ను పొగాకు వినియోగాన్ని నిరోధించడంలో సాయపడుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఉమా కుమార్ తెలిపారు.
తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ధరను పది శాతం పెంచడం వల్ల పొగాకు వినియోగం 4-8 శాతం తగ్గినట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా భారత్ ఏటా రూ.1.77 లక్షల కోట్లను వైద్య ఖర్చుల రూపంలో కోల్పోతోందని అంచనా.