హైదరాబాద్, సెప్టెంబర్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చామంటూ గప్పాలకు పోతున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తున్నది. దేశంలో వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారంగా ఉన్న చేనేత (హ్యాండ్లూమ్), దుస్తుల (టెక్స్టైల్) రంగంపై మోదీ ప్రభుత్వం ట్యాక్స్ వేటు వేసింది. రూ. 2,500 కంటే ఎక్కువ ఖరీదు చేసే చేనేత, ఇతరత్రా వస్ర్తాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని ఏకంగా 18 శాతానికి పెంచింది. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో చేనేత, టెక్స్టైల్ రంగంపై ఆధారపడే కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశమున్నదని పారిశ్రామికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా నిర్ణయం వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతుందని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 2,500 కంటే ఎక్కువ ఖరీదు చేసే చేనేత, ఇతర వస్ర్తాలపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని కేంద్రప్రభుత్వం 18 శాతానికి పెంచింది. రూ. 2,500 కంటే తక్కువగా ఉండే వస్ర్తాలకు, రెడీమేడ్ దుస్తులకు జీఎస్టీని 5 శాతంగా నిర్ణయించింది. కేంద్రప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులతో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు మండిపడుతున్నారు. భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తాము చేతితో నేసే వస్ర్తాలు సంస్కృతికి చిహ్నమని చేనేత కార్మికులు అంటున్నారు. ఒక్కో చేనేత చీరను తయారు చేయాడానికి సహజసిద్ధమైన దారాలను వాడుతామని, చీరలు ఆకర్షణీయంగా కనిపించడానికి సహజ రంగులను వినియోగిస్తామని గుర్తు చేస్తున్నారు.
మెషీన్లను వాడకుండా చేతులతో నేసే ఈ చీరలు ఎంతో మన్నికైనవని, లేబర్ కష్టం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇంతటి శ్రమ ఉన్న కంచి, బెనారస్, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్ వంటి చీరలు రూ. 2,500కు ఎలా వస్తాయని? ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ శ్లాబ్‌తో చేనేత చీరలపై 18 శాతం పన్నును చెల్లించాల్సి వస్తుందని, దీంతో కొనుగోళ్లు తగ్గి తమకు తీరని నష్టాన్ని మిగిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేనేత చీరలపై జీఎస్టీని 18 శాతానికి పెంచిన కేంద్రం.. కృత్రిమ దారాలతో మెషీన్ మీద తయారు చేసిన పాలిస్టర్ వంటి వస్ర్తాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంపై మండిపడ్డారు. మెషీన్‌పై తయారు చేసిన నాసిరకం చీరలు చవగ్గా లభించడంతో వినియోగదారులు వాటినే కొనుగోలు చేస్తారని, దీంతో చేనేతపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేనేత, ఇతరత్రా దుస్తులపై 18 శాతం జీఎస్టీని విధించడంపై ది చాంబర్ ఆఫ్ టెక్స్టైల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీవోటీటీఐ) ప్రతినిధులు భగ్గుమన్నారు. దుస్తులు విలాసవంతమైన వస్తువులేమీ కాదని, అవి అవసరమని వ్యాఖ్యానించారు. చేనేత, ఇతరత్రా వస్ర్తాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రధాని కి లేఖ రాశారు. ‘చేనేత, ఇతరత్రా వస్ర్తాలు విలాసవంతమైన వస్తువులు కాదు. అవి ప్రతీ భారతీయ కుటుంబానికి కనీస అవసరాలు. పండుగలు అయినా, శుభకార్యాలు అయినా, కాలాలను బట్టి వివిధ దుస్తులను ప్రజలు ధరిస్తారు. కేంద్రం పెంచిన జీఎస్టీ ఇప్పుడు వినియోగదారులకు ప్రత్యక్ష భారంగా మారనున్నది. పన్ను పెంపుతో కొనుగోళ్లు తగ్గి టెక్స్టైల్ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల జీవితాలు ఆగమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ప్రభుత్వం దుస్తులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలి’ అని సీవోటీటీఐ ప్రెసిడెంట్ మహేంద్ర జైన్ డిమాండ్ చేశారు.
స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలంటూ ‘వోకల్ ఫర్ లోకల్’, స్వదేశంలోనే ప్రతీ వస్తువును తయారు చేయాలంటూ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’ వంటి పథకాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలోనూ ఇదే నినాదంతో ఓట్లను రాబట్టారు. అయితే, విధానపర నిర్ణయాలకు వచ్చే సరికి, స్వదేశీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచిన చేనేత వస్ర్తాలపై 18 శాతం జీఎస్టీని కేంద్రం విధించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం మన సంస్కృతీ, సాంప్రదాయాలను అవమానించడమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘మేకిన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ నినాదాలు ఇప్పుడు గుర్తు రాలేదా?’ అంటూ బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. చేనేతపై జీఎస్టీ పెంపు ఆ రంగంపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధిని దూరం చేయడమే కాకుండా శతాబ్దాలుగా వారసత్వంగా వస్తున్న మన సంస్కృతిని మసకబార్చడమేనని విమర్శకులు మండిపడుతున్నారు. గ్రామీణ జీవన విధానాలను కనుమరుగు చేసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గత నెల 20న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు చేనేతపై జీఎస్టీని ఎత్తేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో కింది విషయాలను ప్రస్తావించారు. ‘చేనేతపై జీఎస్టీ రద్దు-ఇది మా హక్కు, మీ బాధ్యత: తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. చేనేత మిత్ర పథకంతో ముడి సరుకును 50 శాతం సబ్సిడీకే ఇవ్వడంతో వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు బీమాతో ధీమా ఇచ్చింది. అనేక సంక్షేమ పథకాలను అమలుచేసి మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించాం. లోకం మానం కాపాడటానికి మగ్గం పట్టిన నేతన్న తయారుచేసిన వస్ర్తాలపై ఎలాంటి పన్నులు ఉండొద్దన్న ఉదాత్తమైన ఆలోచన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌తో పాటు మా అందరికీ ఉండేది. ఎన్నో వేదికలపై ఇదే విషయాన్ని మేం స్పష్టం చేశాం.
కానీ, ప్రజా సమస్యలు, ప్రజల అభిప్రాయాలను ఏ కోశానా పట్టించుకోని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీ విధించింది. అంతటితో ఆగకుండా పన్నును 12 శాతం పెంచాలని ఆ తర్వాత నిర్ణయించింది. ఆ సమయంలో దేశంలో అందరికంటే ముందే నేను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రధానమంత్రి మోదీకి బహిరంగ లేఖ రాశాను. వ్యవసాయం తర్వాత లక్షల మందికి జీవనాధారంగా ఉన్న చేనేత రంగంపై పూర్తిగా పన్నును ఎత్తివేయాల్సింది పోయి పెంచుతారా? అని ప్రశ్నించాను.
దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో 12 శాతం నిర్ణయం అమలును మీరు వాయిదా వేశారు. అయితే, చేనేత వస్త్రాలపై ఇప్పుడున్న 5 శాతం జీఎస్టీని కూడా పూర్తిగా రద్దుచేయాలని మరోసారి నేను బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. చేనేత అనేది వస్త్ర తయారీ రంగమే కాదు, అది మన సాంస్కృతిక వారసత్వం కూడా. దానిపై పన్ను వేయడమంటే మన సంస్కృతిని అవమానించడమే’ అని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. చేనేతపై కేంద్రం 18 శాతం జీఎస్టీ విధించిన నేపథ్యంలో కేటీఆర్ రాసిన ఈ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.