KCR | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా పసిగట్టింది. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 87 సీట్లలో గెలవవచ్చని ఎక్స్ (ట్విట్టర్)కు చెందిన ఏఐ టూల్ ‘గ్రోక్’ స్పష్టం చేసింది. కేసీఆర్ పాలనతో రేవంత్ రెడ్డి పనితీరును ప్రజలు పోల్చుకుంటున్నారని, భవిష్యత్తులో బీఆర్ఎస్కే పట్టం కడతారని స్పష్టం చేసింది. 2028లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుస్తుంది? అని ఓ నెటిజన్ గ్రోక్‌ను అడగగా.. ‘2025 మార్చిలో నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే బీఆర్ఎస్ 87 సీట్లు గెలవవచ్చు. కాంగ్రెస్‌పై అసంతృప్తి పెరిగితే బీఆర్ఎస్ బలపడవచ్చు’ అని సమాధానం ఇచ్చింది.
ప్రస్తుత పరిణామాలను బట్టి భవిష్యత్తులో ఏం జరగవచ్చో ఏఐ అంచనా వేస్తుంది. వికీపీడియా ఆర్టికల్స్ నుంచి సైంటిఫిక్ పేపర్స్ వరకు మొత్తం సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి సేకరించి సమగ్రంగా సమాధానాలు ఇచ్చేలా ఏఐ చాట్‌బాట్ అయిన గ్రోక్‌కు శిక్షణ ఇచ్చారు. ఎక్స్‌లో వచ్చే పోస్ట్లన్నీ గ్రోక్‌కు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అందువల్ల గ్రోక్ ఎప్పటికప్పుడు ప్రపంచ పరిజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా గ్రోక్ ఇలాంటి విశ్లేషణ జరిపిన తర్వాతే అంచనా వేసిందని టెక్నాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై గ్రోక్ వేసిన అంచనాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. అలవిగాని హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపడంపై ఆన్లైన్ వేదికగా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఖరిని తూర్పార పడుతున్నారు. ప్రభుత్వ మోసంపై పోస్టులు, వీడియోల రూపంలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ, అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు హైడ్రా కూల్చివేతలు ప్రత్యక్ష ఉదాహరణ. హైడ్రా బాధితుల కన్నీటి గాథల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
ఇదే తరహాలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి నిర్వహణలో అసమర్థత, భూగర్భ జలాలు అడుగంటడం, పంటలు ఎండిపోవడం.. ఇలా ప్రతి అంశం పట్ల నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి తరచూ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు అంతటా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. మంత్రుల వ్యవహారశైలి, విచ్చలవిడి అవినీతిపై పెద్ద ఎత్తున ఆన్లైన్లో చర్చ జరుగుతున్నది. పరిశ్రమల కోసమంటూ రైతుల భూములు బలవంతంగా గుంజుకోవడం, ప్రభుత్వంపై రైతులు తిరగబడటం, ప్రతీకారంగా రైతులపై ప్రభుత్వం దాష్టీకం, లగచర్ల వంటి ఉదాహరణలను గ్రోక్ స్పష్టంగా విశ్లేషించినట్టు చెప్తున్నారు.
ప్రధాన మీడియాలో కొన్నింటిని నయానో, భయానో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. వీటన్నింటినీ గ్రోక్ గమనిస్తూనే ఉన్నదని చెప్తున్నారు. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సర్వేలు, వాటి ఫలితాలను కూడా గ్రోక్ విశ్లేషిస్తున్నదన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పనితీరు మరోమారు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. కేసీఆర్ దార్శనికత, అభివృద్ధిలో రాష్ర్టాన్ని ముందు వరుసలో నిలిపిన తీరును తాజాగా సోషల్ మీడియాలో ‘గ్రోక్’ నిగ్గుతేల్చింది. 2014-24 వరకు దేశంలో అత్యుత్తమ సీఎం ఎవరని ఓ నెటిజన్ ‘ఎక్స్’ అనుసంధానంగా పనిచేస్తున్న ఏఐ టూల్ ‘గ్రోక్’ని ప్రశ్నించాడు. దానికి గ్రోక్ బదులిస్తూ.. కే చంద్రశేఖర్‌రావు దేశంలో అత్యుత్తమ సీఎం అని బదులిచ్చింది. ఇందుకు కారణాలను సవివరంగా వెల్లడించింది. కేసీఆర్ హయాంలో వార్షిక జీఎస్డీపీ 10-12 శాతం పెరిగిందని, మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ) ప్రకారం మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగయ్యాయని తెలిపింది. కేసీఆర్ ఆర్థిక విధానాలు అద్భుతమని కొనియాడింది.
ఈ సమాధానికి మరో ‘ఎక్స్’ వినియోగదారుడు స్పందిస్తూ.. ఇండియా టెక్ అండ్ ఇన్ఫ్రా.. ఆర్బీఐ వెల్లడించిన ‘భారత రాష్ర్టాల గణాంకాల హ్యాండ్ బుక్’ను షేర్ చేశాడు. ఇందులో 2017-18 నుంచి 2022-23 వరకు నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్(ఎన్ఎస్డీపీ)లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 28.52 శాతం అగ్రస్థానంలో ఉండగా.. తమిళనాడు 25.22, కర్ణాటక 25.32 శాతాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటినుంచి తీసుకుంటున్న ఆర్థిక విధానాలతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆగమాగం అయింది. ఈ అంశంపై ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఎవరు ఏమన్నా.. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోతున్న ప్రజలు బీఆర్ఎస్వైపే మొగ్గు చూపుతున్నారని గ్రోక్ స్పష్టంగా తెలిపింది. నెటిజన్లు రేవంత్ రెడ్డి పాలనను కేసీఆర్ పాలనతో పోల్చుకొని, మరోసారి కేసీఆర్‌కే జై కొడుతున్నట్టు ఈ సమాధానం స్పష్టం చేస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ సర్వేల్లోనూ బీఆర్ఎస్కే జై కొడుతున్నారని అర్థమవుతున్నదన్నారు. బీజేపీ కాస్త హడావుడి చేస్తున్నా.. రాష్ట్రంలో ఎప్పటికైనా బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు.