హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి లక్షలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చ్టుటారు. కరోల్ భాగ్ జోన్ నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్‌లో రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మియావాకీ పద్ధతిలో వెయ్యి మొక్కలు నాటి మినీ ఫారెస్ట్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అభివృద్ధి చేయనున్నది. నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభించిన మిషన్ మంచి ఫలితాలు సాధిస్తూ.. పచ్చదనం పెంపు దిశగా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నట్లు ఎంపీ సంతోష్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నలుదిశలా హరిత స్ఫూర్తి విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఇదే క్రమంలో ఢిల్లీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని చేపట్టారంటూ సంతోష్‌కుమార్‌ను అభినందించారు.
రాజకీయాలు, పార్టీలకతీతంగా చేపట్టిన గ్రీన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ ఆకాంక్షించారు. ఢిల్లీలాంటి ప్రాంతంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అవసరమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు. పర్యావరణం పరంగా ఎదురవుతున్న సవాళ్లను కట్టి చేసేందుకు పచ్చదనం పెంపు తక్షణ అవసరమని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ అన్నారు. ఇదిలా ఉండగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వామ్యమయ్యేందుకు రాంకీ సంస్థ ముందుకు వచ్చింది. లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సామాజిక బాధ్యతగా ఓ పార్క్‌ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని ఆ సంస్థ చైర్మన్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీలు బినోయ్ విశ్వం (సీపీఐ), ఏపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు, మోపిదేవి వెంకటరమణ, వంగా గీత, మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాసరెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పసునూరు దయాకర్, రాములు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థల డైరెక్టర్ ఎన్. బలరామ్ కూడా పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమాన్ని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శశాంక్ ఆలా సమన్వయం చేశారు.