Manmohan Singh | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ తెచ్చిన ఆర్థిక సంసరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దు బిడ్డగా కొనియాడారు.
మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని అన్నారు. మితభాషిగా, సౌమ్యుడుగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, ప్రధానిగా మన్మోహన్ దేశానికి అందించిన సేవలు గొప్పవని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా అందించిన మద్దతును తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందన్నారు. మన్మోహన్సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
మన్మోహన్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆధునిక భారత నిశ్శబ్ద వాస్తుశిల్పి అని, నిజమైన మేధావి, మానవతామూర్తని కొనియాడారు. దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతారన్నారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
మన్మోహన్ మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. దూరదృష్టి గల నాయకుడని, భారతదేశ ఆర్థిక సంసరణలకు రూపశిల్పి అని స్మరించుకున్నారు. ప్రజాసేవలో ఆయన అంకితభావం స్ఫూర్తిదాయకమన్నారు.
మన్మోహన్ మృతిపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితతో పాటు, బీఆర్ఎస్ మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. మన్మోహన్ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కూడా సంతాపం తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): దశాబ్దాల పాటు తెలంగాణపై కొనసాగిన అణచివేత, ఆర్థిక దోపిడీ, సామాజిక, సాంస్కృతిక వివక్ష తెలిసిన అతికొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్సింగ్ ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఆకాంక్షలను, రాష్ట్రం ఆవిర్భవించకపోతే జరిగే అనర్థాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పూసగుచ్చినట్టు వివరిస్తే అర్థం చేసుకున్న మనసున్న పాలకుడాయన. 1971లో తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని మాటతప్పిన కాంగ్రెస్ తప్పును 2014లో సరిదిద్ది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత ఆయనకు దక్కుతుంది.
పీవీ నరసింహారావు, కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్‌తో మన్మోహన్‌ది ప్రత్యేక అనుబంధం. మన్మోహన్ శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి తెచ్చింది పీవీనే. కాకతీయ విశ్వవిద్యాలయం మన్మోహన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సమయంలో వీసీగా ఉన్న ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌తోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. 2004 ఎన్నికల ముందు తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన ఆనాటి టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోక తప్పని అనివార్యత ఏర్పడింది. ఆ సమయంలో కేసీఆర్‌ను ఒప్పించేందుకు మన్మోహన్సింగ్ తెరవెనుక ప్రొఫెసర్ జయశంకర్ ద్వారా సమాలోచనలు చేశారు. కేసీఆర్‌ను ‘చంద్రశేఖర్‌జీ’ అని ఆయన ఆప్యాయంగా సంభోదించేవారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు చలించిపోయిన సున్నిత మనస్కుడు మన్మోహన్ సింగ్.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా… కేసీఆర్‌కు, మన్మోహన్ సింగ్‌కు మధ్య వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్ సూచనలు చేశారు.