Karnataka | బెంగళూరు, సెప్టెంబర్ 30: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేస్తారని కథనాలు వస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మీడియాతో మాట్లాడిన ఆయన ‘ఓ గొప్ప నాయకుడు కర్ణాటక సీఎం పదవిని చేజిక్కించుకోవటానికి రూ.1,000 కోట్లతో సిద్ధంగా ఉన్నాడు. ఆ గ్రేట్ లీడర్ ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఆయన పేరును నేను బహిర్గతం చేయను. గతంలో ఆయన ఇంట్లో నోట్ల కౌంటింగ్ మిషన్ కూడా దొరికింది.
డిసెంబర్ నాటికి రాష్ట్ర రాజకీయాల్లో భారీ తిరుగుబాటు తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కారును పడగొట్టేందుకు బీజేపీ ఎలాంటి చర్యలు చేపట్టబోదని, దానంతట అదే కూలిపోతుందని వెల్లడించారు. కాగా, యత్నాల్ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్రంగా పరిగణించారు. సోమవారం ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వరతో భేటీ అనంతరం డీకే మాట్లాడుతూ.. ‘కేపీసీసీ సమావేశం నిర్వహించాం. రూ.1,200 కోట్లతో తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర పన్నినట్టు చెప్పారు. మా లీగల్ టీంతో దీనిపై చర్చిస్తాం. పార్టీ హైకమాండ్‌కు కూడా నివేదించాం. ఆదాయపన్ను శాఖ ఆధ్వర్యంలో దీనిపై దర్యాప్తు జరగాలి’ అని పేర్కొన్నారు.
పరమేశ్వరతో డీకే భేటీ
సీఎం మార్పుపై చర్చ జరుగుతున్న సందర్భంలో పరమేశ్వరతో డీకే భేటీ కావటంపై రాజకీయ వేడి రాజుకుంది. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని డీకే స్పష్టంచేశారు. పార్టీ మ్యానిఫెస్టోపై చర్చించామని తెలిపారు.