న్యూఢిల్లీ, జనవరి 26 : దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారత్ తన సాంస్కృతిక వైభవాన్ని, ఆర్థిక ప్రగతిని, యుద్ధ విమానాలు, స్వదేశీ తయారీ క్షిపణులు, కొత్తగా స్థాపించిన రెజిమెంట్లు, ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన అస్త్రశస్ర్త్తాలతోసహా తన పూర్తి సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటిచూపింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా ఈ వేడుకలకు హాజరుకావడంతో ఈ సందర్భం సైనిక ప్రదర్శనతోపాటు కీలక దౌత్యపరమైన ఘటనగా కూడా మారింది. ఏటా జరిగే ఈ సైనిక కవాతు భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, రష్యా, అమెరికా నుంచి సమీకరించుకున్న ఆయుధ సంపత్తిని ప్రతిబింబించింది. వందేమాతరం గేయం 150 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ ఇతివృత్తంతో జరిగిన గణతంత్ర వేడుక ఆపరేషన్ సిందూర్‌కు కూడా కర్తవ్య పథ్‌లో ప్రాధాన్యత లభించింది. కోస్టా, లేయెన్‌తో కలసి సంప్రదాయ బగ్గీలో కర్తవ్య పథ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక వందనం స్వీకరించిన వెంటనే కవాతు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల ప్రధానాధికారులు, విదేశీ దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు తదితరులు గణతంత్ర కవాతును వీక్షించారు.
బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, రాకెట్ లాంచర్ వ్యవస్థ సూర్యాస్త్ర, ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్, కొత్తగా ఏర్పర్చిన శక్తిబన్ రెజిమెంట్తోసహా తన ఫ్రంట్‌లైన్ సైనిక సంపత్తిని భారత్ ప్రపంచానికి ప్రదర్శించింది. పాకిస్థాన్‌పై గత ఏడాది మే 7-10 మధ్య త్రివిధ దళాలు సంయుక్తంగా సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయానికి సూచనగా బాణం గుర్తు, త్రివర్ణ పతాకంతో కూడిన త్రివిధ దళాల ప్రత్యేక శకట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం వైమానిక దళం తన యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించింది. 16 యుద్ధ విమానాలు, నాలుగు రవాణా విమానాలు, తొమ్మిది హెలికాప్టర్లతోసహా మొత్తం 29 విమానాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో రాఫెల్, ఎస్‌యూ-30, ఎంకేఐ, మిగ్-29, జాగ్వార్ విమానాలు కూడా ఉన్నాయి. బ్రహ్మోస్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు, అడ్వాన్డ్స్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, ధనుష్ ఆర్టిలరీ గన్, దివ్యాస్త్ర బ్యాటరీ, కొన్ని డ్రోన్లను కూడా పరేడ్‌లో ప్రదర్శించారు. భూమి నుంచి భూమిపైని లక్ష్యాలను 300 కిలోమీటర్ల వరకు ఛేదించగల రాకెట్ లాంచర్ సిస్టమ్ సూర్యాస్త్రను కూడా పరేడ్‌లో మొదటిసారి ప్రదర్శించినట్లు అధికారులు చెప్పారు.

విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా మార్చగలదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సోమవారం ప్రకటించారు. గణతంత్ర వేడుకలను వీక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. మంగళవారం భారత్-యూరోపియన్ మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకావడం జీవితకాల గౌరవంగా ఉర్సులా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
కొత్తగా స్థాపించిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్, రాకెట్ లాంచర్ వ్యవస్థ సూర్యాస్త్ర, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సైనిక సంపద, వాటి వెంబడి సైనిక సిబ్బంది వంటివి అనేకం ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొట్టమొదటిసారి ప్రజల ముందుకు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు మూపురాలు ఉన్న ఒంటెలు, హిమాలయాలకు చెందిన పొట్టి గుర్రాలు కూడా మొదటిసారి సంప్రదాయక కవాతులో భాగస్వామ్యం అయ్యాయి. అదే విధంగా మొదటిసారి 61 క్యావల్రీ కంటింజెంట్‌కు చెందిన సిబ్బంది సంప్రదాయ దుస్తులతో అశ్వాలపై కూర్చుని కవాతులో పాల్గొన్నారు. అలాగే మిశ్రమ స్కౌట్స్ కంటింజెంట్ కూడా తొలిసారి గణతంత్ర పరేడ్‌లో పాల్గొంది. భారీ ఉన్ని దుస్తులు, పోలరైజ్డ్ సన్‌గ్లాసెస్, ప్రత్యేక బూట్లు ధరించి ఎత్తయిన శీతల ప్రదేశాల్లోని వాతావరణాన్ని తట్టుకునే విధంగా రాటుతేలిన ఈ కంటింజెంట్ సిబ్బంది కవాతులో పాల్గొనగా వీక్షకులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. సైనికుల కాల్పుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్టిలరీలో కొత్తగా నెలకొల్పిన శక్తిబన్ రెజిమెంట్ కూడా మొదటిసారి ఈ ఏడాది గణతంత్ర కవాతులో పాల్గొంది. గత ఏడాది అక్టోబర్‌లో స్థాపించిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా కవాతులో మొదటిసారి పాల్గొంది.