Vegetable Cluster | న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశంలోని పలు నగరాల్లో దాదాపు 50 కూరగాయల క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ శాఖ రూపొందిస్తున్న ఈ పథకం త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు రానున్నట్టు సమాచారం. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల సమీప ప్రాంతాల్లో ఈ వెజిటెబుల్ హబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ స్కీమ్ ద్వారా మధ్యవర్తుల వ్యవస్థ ఉండదని, కస్టర్లకు నేరుగా కూరగాయల సరఫరా ద్వారా రైతుల సాధికారిత సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
కూరగాయల ఉత్పత్తి పెరుగుతుందని, సైప్లె చైన్లు మెరుగవుతాయని పేర్కొన్నాయి. రైతులు, వినియోగదారులకు ధరలను స్థిరీకరించడంతో పాటు ఉత్పత్తిని పెంచడం ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యమని వెల్లడించాయి. ఈ కొత్త విధానం ద్వారా పెద్ద నగరాల సమీపంలో ఉండే 2 లక్షలకు పైగా రైతులు లబ్ధి పొందుతారని పేర్కొన్నాయి. రైతుల నుంచి వినియోగదారులకు డైరెక్ట్ సైప్లె చైన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మధ్యవర్తుల పాత్రను తగ్గించొచ్చని ఓ అధికారి అన్నారు.