న్యూఢిల్లీ, జూలై 7: ఉమ్మడి పౌరస్మృతి.. మనదేశంలో దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పదమూ, చర్చనీయాంశమూ అయిన అంశాల్లో ఇదీ ఒకటి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే యూసీసీపై తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. రాజ్యాంగ కర్తలు కూడా రెండుగా చీలిపోయిన వాదించుకొన్నారంటే ఈ అంశం ఎంతటి వివాదాస్పదమైనదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దేశ మొదటి ప్రధాని నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌తోపాటు కాంగ్రెస్‌వాదులంతా మొదట యూసీసీని బలంగా సమర్థించగా, రాజ్యాంగ సభలోని ముస్లిం, క్రిష్టియన్, పార్సీ తదితర మైనారిటీ వర్గాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. 75 ఏండ్ల తర్వాత కూడా ఈ అంశంపై అదే రచ్చ జరుగుతున్నది. 2024 ఎన్నికలు మరో ఆరునెలలే ఉన్న సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూసీసీని మరోసారి తెరపైకి తెచ్చింది. ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేసి తీరుతామని ప్రధాని మోదీసహా బీజేపీ నేతలంతా శపథాలు చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును సభముందు ఉంచే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో యూసీసీపై కాలానుగుణంగా ఏం జరిగింది? దానికి మద్దతు ఇచ్చినవారు ఎవరు? వ్యతిరేకించింది ఎవరు? యూసీసీ ఎందుకంత వివాదాస్పదమవుతున్నది? అనే అంశాలను చూద్దాం..
మన రాజ్యాంగకర్తలు యూసీసీని ఆదేశికసూత్రాల్లో భాగంగా చేర్చారు. రాజ్యాంగంలోని 4వ భాగం, ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలను పొందుపర్చారు. ఆర్టికల్ 44 కూడా యూసీసీ గురించి చెప్తున్నది. ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా సాధించుకోవటానికి వీలులేదన్న విషయం తెలిసిందే. దేశహితం కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన పలు ముఖ్యమైన చర్యలపై ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిన ‘సూచన’లే ఆదేశిక సూత్రాలు. వీటిని ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరం లేదు. అవసరం అనుకొంటే ఈ సూత్రాల్లోని ఏ అంశంపైన అయినా పార్లమెంటు చట్టాలు చేయవచ్చు.
యూసీసీపై స్వాతంత్య్రానికి పూర్వం నుంచి మైనారిటీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దేశ విభజన సమయంలో ముస్లింలీగ్ అధినేత మహ్మద్ ఆలీజిన్నా యూసీసీని హిందూ చట్టంగా అభివర్ణించారు. ఆ సమయంలో చెలరేగిన తీవ్ర హింసలో వేలమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాజ్యాంగ సభ యూసీసీపై ఆచితూచి అడుగులు వేసింది. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకొన్న స్వాతంత్య్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలమధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకు యూసీసీ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనబెట్టింది. భవిష్యత్తులో ప్రభుత్వాలు యూసీసీ అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచన మాత్రం చేసింది.
రాజ్యాంగ సభలో యూసీసీపై 1948, నవంబర్ 23న చర్చ మొదలైంది. కాంగ్రెస్ సభ్యురాలు మీను మసాని మొదట చర్చ లేవనెత్తారు. హన్సా మెహతాసహా సభలోని మహిళా సభ్యులు చాలామంది యూసీసీకి మద్దతు తెలిపారు. ప్రధాని నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, రాజకుమారి అమృత్‌కౌర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కేఎం మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ యూసీసీకి బలంగా మద్దతు పలికారు. దీనిని మైనారిటీ సభ్యులు వ్యతిరేకించారు. మద్రాస్‌కు చెందిన సభ్యుడు మొహమ్మద్ ఇస్మాయిల్ నేతృత్వంలో నజీరుద్దిన్ అహ్మద్, మహబూబ్ అలీబేగ్, బీ పోకర్ సాహెబ్, అహ్మద్ ఇబ్రహీం, ప్రముఖ ఉర్దూ కవి హస్రత్మొహానీ యూసీసీకి వ్యతిరేకంగా బలమైన వాదన వినిపించారు.
భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. అదే సమయంలో ప్రభుత్వాలు, పౌరుల బాధ్యతలను గుర్తుచేస్తూ ఆదేశిక సూత్రాలను ఇచ్చింది. ప్రాథమిక హక్కులను దేశంలోని ఏ పౌరుడైనా ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లి కాపాడుకోవచ్చు. ఆదేశిక సూత్రాల విషయంలో ఆ అవకాశం లేదు. దీంతో చాలాసార్లు ఈ రెండింటి మధ్య వివాదాలు తలెత్తాయి. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలుచేయాలని ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాల ద్వారా రాజ్యాంగం సూచిస్తున్నది. అదే సమయంలో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ప్రసాదించింది. దేశంలోని అన్నిమతాలవారు తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చని, అభివృద్ధి చేసుకోవచ్చని రాజ్యాంగం సూచించింది. దీంతో ఆదేశిక సూత్రాల ప్రకారం యూసీసీని అమలుచేస్తే కొన్నిసందర్భాల్లో మతస్వేచ్ఛకు భంగం కలుగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
కేంద్రం యూసీసీని అమలుచేయాలని కృతనిశ్చయంతో ఉంటే.. ముందుగా మత, కుల, వర్గ మైనారిటీల హక్కులకు ఎలా రక్షణ కల్పిస్తుందో వివరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం హిందువులు, ముస్లింలు, క్రిష్టియన్లకు పర్సనల్ లాలున్నాయి. వీటి ప్రకారమే ఆయా మతస్తులు వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తుల్లో వాటాల పంపకం, దత్తత వంటి ఆచారాలను అనుసరిస్తున్నారు. హిందూమతం ప్రకారం దత్తత తీసుకోవటం చట్టబద్ధం. ముస్లిం లాలో దత్తత అనే అంశమే లేదు. హిందూమతంలో భార్యాభర్తల్లో ఎవరైన విడాకులు కోరవచ్చు. ముస్లిం లా ప్రకారం భర్తకు మాత్రమే విడాకులు కోరే హక్కు ఉన్నది. హిందూ పురుషుడు ఒకే వివాహం చేసుకోవటానికి చట్టం అనుమతిస్తుంది. మరో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలి. ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. ఈ ఆచారాలను యూసీసీ ఎలా బ్యాలన్స్ చేస్తుందని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. హిందువులే అయినప్పటికీ గిరిజనులకు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలున్నాయి. యూసీసీ వల్ల వాటికి భంగం కలుగుతుందని ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
భారతీయులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకురావాలి. దానివల్ల ప్రస్తుతం వ్యక్తిగత న్యాయ చట్టాల్లో (పర్సనల్ లా) మహిళలపట్ల ఉన్న వివక్షను రూపుమాపవచ్చు. వివక్షను అంతం చేయవచ్చు. యూసీసీ వల్ల మహిళలకు వివాహం, విడాకులు, వారసత్వం విషయంలో సమాన హక్కులు లభిస్తాయి.
– బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు
సామాజిక సంస్కరణలు చేపట్టి, దేశాన్ని ఆధునికతవైపు నడిపించాలంటే మత ప్రాతిపదికన ఏర్పడిన వ్యక్తిగత చట్టాల స్థానంలో సమగ్ర ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తేవాలి. లౌకికవాదానికి, వ్యక్తిగత హక్కులకు యూసీసీ మరింత బలాన్నిస్తుంది. దేశాన్ని వేగంగా సమైఖ్యపరిచి, ప్రగతిపథంలో దూసుకుపోయేందుకు యూసీసీ దోహదపడుతుంది.
– జవహర్లాల్ నెహ్రూ, భారత మొదటి ప్రధాని.
ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేస్తే మైనారిటీల స్వతంత్రత, హక్కులు తుడిచిపెట్టుకుపోతాయి. దేశంలో మతపరమైన, సాంస్కృతికపరమైన భిన్నత్వాన్ని అందరూ గౌరవించాలి. పర్సనల్ న్యాయ చట్టాలను రక్షించాలి.
– మౌలానా అబుల్‌కలాం ఆజాద్, స్వాతంత్య్ర సమరయోధుడు
భారత్‌లో విశిష్టమైన స్థానం సంపాదించిన సాంస్కృతిక భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని గౌరవించాలి. ఉమ్మడి పౌరస్మృతి వీటిని దెబ్బతీస్తుంది. మైనారిటీల హక్కులను కాపాడాలి. దేశంలోని భిన్న వర్గాల ప్రజలు వారి ప్రత్యేక గుర్తింపును నిలుపుకొనేందుకు వీలు కల్పించాలి.
– ఫ్రాంక్ ఆంటోనీ, రాజ్యాంగ సభ సభ్యుడు.
యూసీసీ వల్ల మత స్వేచ్ఛ హరించుకుపోతుంది. మైనారిటీల హక్కులు ప్రమాదంలో పడుతాయి. యూసీసీని అమలుచేసేబదులు సామాజిక సంస్కరణలు అమలుచేసి పర్సనల్ న్యాయచట్టాల్లోనే తగిన మార్పులు చేయాలి.
– కేటీ షా, రాజ్యాంగ సభ సభ్యుడు, ప్రముఖ సోషలిస్ట్ నేత.
దేశ సమగ్రతను పెంపొందించాలంటే ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేయాలి. యూసీసీతో మత, కుల వివక్షను రూపుమాపొచ్చు. ప్రజల మతం, కులంతో సంబంధం లేకుం డా అందరికీ సమానంగా వర్తించేలా చట్టాలు చేయాలి.
– సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, భారత మొదటి ఉపప్రధాని