Demonetisation | న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు బదులిచ్చారు. 2017లో రూ.9.412 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలో ఉండగా, 2022 మార్చి నాటికి రూ.27.057 లక్షల కోట్లకు పెరిగినట్టు చెప్పారు.
నోట్ల రద్దు తర్వాత రూ.9.21 లక్షల కోట్ల విలువైన 500, 2000 రూపాయల నోట్లు చెలామణిలోకి వచ్చాయని, అయితే అవి బ్లాక్ మనీగా మారిపోయాయా?, 2000 నోట్లను ఏటీఎంలో ఉంచొద్దని, బ్యాంకుల్లో వినియోగదారులకు ఇవ్వవద్దంటూ ఏమైనా ఆదేశాలు జారీ అయ్యాయా? అని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశ్నించారు. దానికి ఆర్థిక మంత్రి బదులిస్తూ.. 2000 నోట్లు ఏటీఎంల్లో ఉంచొద్దని, బ్యాంకుల ద్వారా సరఫరా చేయవద్దంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. బ్యాంకులు తమకు అనుకూలంగా కావాల్సిన డినామినేషన్లలో నోట్లను ఏటీఎంలలో పెట్టవచ్చన్నారు. 2019-20 నుంచి 2000 నోట్ల ముద్రణకు ఆర్బీఐ నుంచి ఎలాంటి ఇండెంట్ రాలేదని మంత్రి తెలిపారు.