పాట్నా, అక్టోబర్ 28: వచ్చే నెలలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన విపక్ష మహాఘట్బంధన్ కూటమి మంగళవారం తేజస్వీ ప్రాణ్ (తేజస్వీ ప్రతిజ్ఞ) పేరిట ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో ప్రతి ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చట్టాన్ని చేస్తామని ప్రతిజ్ఞ చేసింది.
ప్రతి మహిళకు డిసెంబర్ 1నుంచి నెలకు రూ.2,500 చొప్పున ఐదేండ్ల పాటు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, స్వయం సహాయక బృందాలుగా ఉన్న జీవికలను నెలకు రూ.30 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తామని తెలిపింది.