న్యూఢిల్లీ: జాతి రక్షణ కోసం అహర్నిశలు పాటుపడే వీర సైనికులు, పోలీస్, అగ్నిమాపక, ఇతర శాఖల సిబ్బందికి 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం 1,090 మందికి శౌర్య విశిష్ట సేవా పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 233 శౌర్య పతకాలు ఉన్నాయి. 99 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పీఎస్ఎం), 758 మెరిటోరియస్ సర్వీస్ పతకాలు (ఎంఎస్ఎం) ఉన్నా యి. అలాగే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత దేశం తన వార్షిక సైనిక గౌరవాల జాబితాలో ఆపరేషన్ సిందూర్ ప్రణాళిక అమలులో పాల్గొన్న సీనియర్ సైనిక అధికారుల పాత్రను, సాయుధ దళాల సిబ్బంది ధైర్య సాహసాలను గుర్తించింది.
మన సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాల సిబ్బందికి 127 శౌర్య పురస్కారాలు, 40 విశిష్ట సేవా పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. వీటిలో నాలుగు కీర్తిచక్ర, 16 వీర చక్ర, 16 శౌర్య చక్ర, రెండు బార్ టు సేన పతకాలు (శౌర్యం), 58 సేన పతకాలు (శౌర్యం), ఆరు నవోసేన పతకాలు (శౌర్యం), 26 వాయుసేన పతకాలు (శౌర్యం) ఉన్నాయి. అలాగే ఈ అవార్డులలో ఏడు సర్వోత్తమ యుద్ధ సేవా పతకాలు, తొమ్మిది ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 24, యుద్ధ సేవా పతకాలు కూడా ఉన్నాయి.
వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అవదేశ్ కుమార్ భారతి, ఇండియన్ ఆర్మీ డీజీఎంఓ లెఫ్ట్నెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ ప్రతీక్ శర్మ వంటి ఉన్నతాధికారులను సర్వోత్తమ యుద్ధ సేవా పతకాలకు ఎంపిక చేశారు. ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్, ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాలు కూడా సర్వోత్తమ యుద్ధ సేవా పతకానికి ఎంపికయ్యారు. 9 మంది యుద్ధ విమాన పైలట్లను వాయు చక్రకు ఎంపిక చేశారు.