IND vs PAK : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) తో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దేశాన్ని అన్నివైపుల నుంచి దిగ్బంధించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎగుమతి చేసే ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులు వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సేకరిస్తోంది. ఆ వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మా ఎక్స్పోర్ట్ బాడీ ఫార్మెక్సిల్‌ను కోరింది.
తాము పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తుల డేటాను కోరామని, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ దిశగా పనిచేస్తోందని, త్వరలో ఆ వివరాలు పంపనుందని డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి జాతీయ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో పాకిస్థాన్ 38వ స్థానంలో ఉందని అన్నారు.
పాకిస్థాన్‌కు దుబాయ్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రమని, భారత్ నుంచి యూఏఈకి ఎగుమతి అయ్యే ఔషధాలను తిరిగి పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటుందని, భారత్ ఈ వాణిజ్య సంబంధాలను తెంచుకోవడం ద్వారా పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం పడనుందని మరో అధికారి అంచనా వేశారు. కాగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురికావడం ఇదే తొలిసారి కాదు. బాలాకోట్ వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా ఈ పరిస్థితులు కనిపించాయి.
మరోవైపు పాకిస్థాన్‌కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని కూడా పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిపై ఆంక్షలు విధించే దిశగా యోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే భారత్-పాకిస్థాన్ మధ్య డెరెక్ట్ వాణిజ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. యూఏఈ, శ్రీలంక, సింగపూర్ తదితర దేశాల నుంచి భారత్ వస్తువులు పాకిస్థాన్‌కు చేరుతుంటాయి. వాటిలో బంగారం, విలువైన రంగురాళ్లు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్ ఉత్పత్తులు ఉన్నాయి.
గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్ డేటా ప్రకారం.. ఈ థర్డ్ కంట్రీస్ ద్వారా పది బిలియన్ డాలర్లకుపైగా విలువైన భారత వస్తువులు దాయాదికి ఎగుమతి అవుతున్నాయి. ఈ నెల 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.