Karnataka | హైదరాబాద్, సెప్టెంబర్ 23(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ముడా, వాల్మీకి స్కామ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుతాన్ని ఇబ్బందులు వీడట్లేదు. పదేండ్ల కిందటి అర్కావతి లేఅవుట్ భూ కుంభకోణానికి సంబంధించి జస్టిస్ హెచ్ఎస్ కెంపన్న కమిషన్ ఇచ్చిన నివేదిక కాపీని ఇవ్వాలంటూ గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీశ్కు గవర్నర్ కార్యాలయం ఓ లేఖ రాసింది.
2014లో బెంగళూరు నగరాభివృద్ధిలో భాగంగా అప్పటి సిద్ధరామయ్య సర్కారు భూసేకరణ చేపట్టింది. అయితే, అర్కావతి లే అవుట్‌లోని దాదాపు 540 ఎకరాలను సేకరించకూడదంటూ సర్కారు డీనోటిఫై చేసింది. అయితే, భూ యజమానులకు లబ్ధి చేకూర్చడానికే ప్రభుత్వం ఇలా చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. దీంతో అప్పటి సిద్ధరామయ్య సర్కారు జస్టిస్ కెంపన్న నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై విచారించిన కమిషన్ 2017లో సిద్ధరామయ్య ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే, ఆ నివేదికలోని అంశాలు ఇప్పటివరకూ బయటపెట్టలేదు. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి గత నెల గవర్నర్‌కు లేఖ రాశారు. నివేదికలోని అంశాలను బయటపెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
అర్కావతి లే అవుట్ భూ కుంభకోణం విలువ రూ. 8 వేల కోట్లని, కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అప్పటి సిద్ధరామయ్య సర్కారు 868 ఎకరాల భూమిని సేకరించకుండా విడిచిపెట్టిందంటూ 2023 ఫిబ్రవరిలో అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై శాసనసభలో అరోపించారు. ఈ మేరకు కెంపన్న కమిషన్ రిపోర్ట్‌ను ఉదహరించారు.