న్యూఢిల్లీ, జూలై 8: ఉద్యోగినులు, విద్యార్థినులకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులు మంచి నిర్ణయమే అయినప్పటికీ.. దీనివల్ల మహిళలకు ఉద్యోగ అవకాశాలను దూరమయ్యే అవకాశముందని అభిప్రాయపడింది. ఏదేమైనప్పటికీ.. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి, ఒక మోడల్ పాలసీని తీసుకురావాలని సూచించింది.
సొరేన్‌కు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఈడీ
న్యూఢిల్లీ, జూలై 8: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సొరేన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పడంలో జార్ఖండ్ హైకోర్టు పొరపాటు పడిందని తెలిపింది. గత నెల 28న బెయిల్‌పై వచ్చిన సొరేన్ సీఎంగా తిరిగి ప్రమాణం చేశారు.