న్యూఢిల్లీ: బూస్టర్ డోసు, పిల్లలకు కరోనా టీకా అంశాలపై వైద్య నిపుణుల అభిప్రాయాలు, సూచనల మేరకు నిర్ణయం తీసుకొంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం లోక్సభకు తెలిపారు. బూస్టర్ డోసుతో రక్షణపై శాస్త్రీయపరమైన అధ్యయనం జరుగుతున్నదని తెలిపారు. దేశంలో కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలపై శుక్రవారం కూడా చర్చ కొనసాగింది. ఈ అంశంపై మొత్తంగా 11 గంటల పాటు చర్చ జరిగింది. లోక్సభ చరిత్రలో అతి సుదీర్ఘమైన చర్చల్లో ఇది ఒకటని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చెప్పారు. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని గరిష్ఠంగా ఐదేండ్ల వరకు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లులను కేంద్రం శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. మరోవైపు, శుక్రవారం లోక్సభలో 153 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. విద్యాసంస్థల్లో భగవద్గీత బోధన, మూకదాడుల నుంచి రక్షణ బిల్లులు కూడా ఇందులో ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ డాటా ప్రైవసీ బిల్లును ప్రవేశపెట్టారు.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలో 22వేల పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఇదిలా ఉండగా, 12 మంది ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ విపక్షాల ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. విపక్షాల తీరుపై బీజేపీ ఎంపీలు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు.