బెంగళూరు: ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేటు కూలింది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసుపత్రికి తరలించారు. (School Gate Collapses) కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాలకుండి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రధాన ద్వారం కూలిపోయింది. స్కూల్ గేట్ తెరుస్తున్నప్పుడు అక్కడున్న విద్యార్థులపై అది పడింది.
కాగా, ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్కల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం బాగల్‌కోట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. గాయపడిన మిగతా ముగ్గురు విద్యార్థులను ఇల్కల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు స్కూల్ గేటు కూలడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా అది కూలినట్లు గుర్తు చేశారు. గేటు శిథిలావస్థలో ఉన్నదని పాఠశాల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత మరమ్మతులు చేపట్టలేదని ఆరోపించారు. ఈ సమాచారం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.