Instagram : పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కంటెంట్ వెంటనే తొలగించాలంటూ ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అడ్ ఐటీ శాఖ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక దాడిని ప్రోత్సహించేలా అభ్యంతరకర పెయిడ్ యాడ్స్ వస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.
ఈ తరహా యాడ్స్‌ను, కంటెంట్‌ను తొలగించాలంటూ ఆదేశాలిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల గురించి ప్రసారమవుతున్న అభ్యంతరకర యాడ్స్‌పై ఇటీవల బీబీసీ ఒక కథనం ప్రచురించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. మెటాకు నోటీసులు జారీ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అడ్ ఐటీ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఈ శాఖ ఆదివారం మెటాకు నోటీసులు ఇచ్చింది. ఈ యాడ్స్‌ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సూచించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి విధానాలు పాటిస్తారో చెప్పాలని ఆదేశించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను ఎలా అనుమతించారని ప్రశ్నించింది. అలాగే, మెటా ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుంటే సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అసభ్యకర కంటెంట్ ప్రసారమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ యాప్‌లను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, చట్ట వ్యతిరేక, పిల్లలపై లైంగిక చర్యలకు సంబంధించిన కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నారనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. బీబీసీ కథనాలతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌పై వచ్చే పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర యాడ్స్‌పై క్లిక్ చేస్తూ అది టెలిగ్రామ్‌లోకి ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్తే రూ.99కే అభ్యంతరకర కంటెంట్ అంటూ వీడియోలు ఉంటున్నాయి. ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన యాప్ అయినప్పటికీ.. దీని ద్వారా మెటాకు ఆదాయం వస్తుంది కాబట్టి.. మెటానే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.