రాయపూర్: బాగేశ్వర్ ధామ్ అధిపతి, ధార్మిక ప్రచార కర్త ధీరేంద్ర శాస్త్రి బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ హెలికాప్టర్లో ప్రయాణించడం, విమానాశ్రయంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారి ఆయన పాదాలకు నమస్కరించడం రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఇది ప్రజా ధనం దుర్వినియోగం అని కాంగ్రెస్ ఆరోపించగా బీజేపీ మా త్రం పోలీసు అధికారి చర్యను వ్యక్తిగత విశ్వాసంగా అభివర్ణించింది.
ఇటీవల దుర్గ్ జిల్లాలోని భిలాయ్‌లో ధార్మిక ప్రసంగం ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ మంత్రి గురు కుష్వంత్ సాహెబ్‌తో కలసి ధేరేంద్ర శాస్త్రి రాయపూర్ చేరుకున్నారు. మంత్రి, శాస్త్రి హెలికాప్టర్ నుంచి దిగగా యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీసు అధికారి మంత్రికి సెల్యూట్ చేసి ఆ తర్వాత క్యాప్ తీసి చేతిలో పట్టుకుని ముందుకు వచ్చి శాస్త్రి పాదాలను తాకారు. ఈచర్యతో పాటు ఆధాత్మిక ప్రచార కర్త కోసం ప్రభుత్వ హెలికాప్టర్‌ను ఉపయోగించడంపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.