న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల(West Asia Crisis) అంశంపై సమీక్ష నిర్వహించే నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా అంశంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. సోమవారం లోక్‌సభలో, ఇవాళ రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ఇరాన్ సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు లోక్‌సభలో మోదీ అన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ధీటుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్‌ను ఎదుర్కొన్న రీతిలో రాబోయే రోజులకు ప్రిపేరై ఉండాలన్నారు.
ఇవాళ రాజ్యసభలో కూడా మోదీ ఈ అంశాలనే ప్రస్తావించారు. అన్ని వనరుల నుంచి గ్యాస్‌ను, క్రూడ్ ఆయిల్‌ను సమీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల తీవ్ర ఎనర్జీ సంక్షోభం ఏర్పడిందని, ఆ సంక్షోభాన్ని తట్టుకునే రీతిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. చర్చలు, దౌత్యం ద్వారా శాంతిని నెలకొల్పాలని భావిస్తున్నామన్నారు. యుద్ద ఉద్రిక్తతలు తగ్గాలని, హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ఆయన కోరారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
ఒకవేళ పశ్చిమాసియా పరిస్థితులు సుదీర్ఘ కాలం కొనసాగితే అప్పుడు పరిస్థితులు భయానకంగా ఉంటాయన్నారు. భారత్ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్ ఇంధనం ఉన్నట్లు చెప్పారు. రాబోయే రోజుల ఆ సంఖ్యను 65 లక్షల మెట్రిక్ టన్నులకు చేర్చనున్నట్లు తెలిపారు. ఇంధన నౌకల తయారీ ప్రాజెక్టు కోసం సుమారు 70 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
#WATCH | West Asia conflict | In Rajya Sabha, PM Narendra Modi says, “In this situation of crisis, safety of Indians around the world is an utmost priority for us. More than 3,75,000 Indians have safely returned to India to date. More than 1000 Indians have returned from Iran… pic.twitter.com/sVfYeBE1hS
— ANI (@ANI) March 24, 2026