AAP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోమవారం జరిగిన భేటీలో పార్టీ నేతలు కీలక చర్చలు జరిపారు. సమావేశానంతరం ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ సమావేశ వివరాలను వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నందున ఢిల్లీ మంత్రి అతిషి ఆగస్ట్ 15న ప్రభుత్వం తరపున జాతీయ జెండాను ఎగురవేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖలకు సమాచారం చేరవేశామని తెలిపారు.
ఇక రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించామని వెల్లడించారు. పార్టీ సమిష్టిగా ప్రజల ముందుకు వెళ్లాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సూచించారని పేర్కొ్న్నారు. ఢిల్లీలో తాము ఆగస్ట్ 14న పాదయాత్ర చేపడతామని చెప్పారు. అవసరమైనప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ పార్టీ శ్రేణులకు చేరవేస్తారని, కేజ్రీవాల్ సూచనలతో పార్టీ సమిష్టిగా ముందుకెళుతుందని గోపాల్ రాయ్ తెలిపారు.
కాగా, త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం పార్టీ శ్రేణులు, ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మనీష్ సిసోడియా నివాసంలో ఆదివారం పార్టీ నేతలతో కీలక భేటీ జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించామని మంత్రి వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని సౌరభ్ భరధ్వాజ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని అంతకుముందు ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ స్వాగతించారు.
Read More :