న్యూఢిల్లీ, మే 14: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా వరుసగా మూడోరోజు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.650 తగ్గి రూ.97 వేల దిగువకు రూ.96,850కి దిగొచ్చినట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
వాణిజ్య యుద్ధాలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కొలిక్కి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి ఏకంగా రూ.1,450 తగ్గి రూ.98 వేలుగా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 20.65 డాలర్లు తగ్గి 3,229.64 డాలర్లుగా నమోదైంది.