గోవాలో హంగ్ వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. అప్పుడే రిసార్ట్ రాజకీయం ప్రారంభించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఇప్పటి నుంచే రిసార్టుల్లోకి పంపడం ప్రారంభించేసింది. గెలిచిన తర్వాత ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా వుండేందుకు ముందు జాగ్రత్తగానే ఈ చర్యలకు కాంగ్రెస్ ఉపక్రమించింది. ఫలితాలు వెలువడే వరకూ వీరందరూ గోవాలోని ఓ రిసార్టుల్లోనే ఉంటారని పార్టీ పరిశీలకులు పేర్కొన్నారు.
2017 లో గోవాలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది కూడా. ఇంతలోనే బీజేపీ అలర్ట్ అయ్యింది. చిన్న పార్టీలు, తమతో కలిసి వచ్చే పార్టీలతో మంతనాలు జరిపి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఢీలా పడిపోయింది. మళ్లీ ఇప్పుడు కూడా ఇలాంటి పరాభవం ఎదురు కావొద్దని, కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారందరూ పార్టీలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.