పనాజి: గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే ఆదేశాన్ని సీఎం ప్రమోద్ సావంత్ (Pramod Sawant) తోసిపుచ్చారు. సీనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేయబోమని హామీ ఇచ్చారు. ఈ వివాదాన్ని సమీక్షించినట్లు సీఎం ప్రమోద్ సావంత్ ఆదివారం తెలిపారు. ఆరోగ్య మంత్రితో తాను చర్చలు జరిపినట్లు చెప్పారు. ‘డాక్టర్ రుద్రేష్ కుట్టికర్ను సస్పెండ్ చేయబోమని గోవా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ప్రతి పౌరుడికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సంరక్షణకు అంకితభావంతో కూడిన వైద్య బృందం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నది. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యుల అవిశ్రాంత కృషి, అమూల్యమైన సేవలను కూడా మేం అభినందిస్తున్నాం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే శనివారం ఆకస్మికంగా బాంబోలిమ్‌లోని గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను సందర్శించారు. క్యాజువాలిటీ వార్డులో తన అత్తపై డాక్టర్ అహంకారంగా ప్రవర్తించారన్న సీనియర్ జర్నలిస్ట్ ఆరోపణలను మంత్రి ప్రస్తావించారు. సహనం కోల్పోయిన ఆయన చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ రుద్రేష్‌పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆ సీనియర్ డాక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని అక్కడికక్కడే ఆదేశించారు.
మరోవైపు డ్యూటీలో ఉన్న సీఎంవోను తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తీరును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తప్పుపట్టింది. అయితే తన చర్యను ఆ మంత్రి సమర్థించుకున్నారు. రోగి పట్ల ఆ వైద్యుడు అహంకారపూరితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వైద్య సేవలు నిరాకరించిన రోగికి తాను అండగా నిలిచినట్లు చెప్పారు. అందుకే ఆ డాక్టర్‌తో తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పబోనని మీడియాతో అన్నారు.
Also Read: