Supreme Court : దేశంలోని విద్యా సంస్థల్లో టాయిలెట్లు, శానిటరీ న్యాప్కిన్స్ లేని కారణంగా బాలికలు చదువు మానేయకుండా చూడాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి, రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. జస్టిస్ బీ పర్దివాలా, ఆర్ మహదేవన్ ఆధ్వర్యంలోని బెంచ్ తాజాగా ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ దేశంలోని విద్యాసంస్థల్లో బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్లు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో గత జనవరి 30న జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని ప్రభుత్వాలకు సూచించింది.
విద్యా సంస్థల్లో శానిటరీ న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచాలని, బాలికల కోసం విడిగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బయోడీగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్స్ అందించాలని సూచించింది. ఇవి సద్వినియోగం అయ్యేలా చూడాలని, దీనివల్ల దేశంలోని బాలికలు, మహిళలకు ఎంతో మేలు చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ సదుపాయాలు లేని కారణంగానే చాలా మంది ఆడపిల్లలు చదువు మానేసి, ఇంట్లో పనులకు అంకితమవుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.ఈ తీర్పును ప్రభుత్వాలు అమలు చేయడం, దాని ఫలాలు అందరికీ అందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని కోర్ట్ తెలిపింది.
గతంలో ఆదేశించిన ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో టాయిలెట్లు, శానిటరీ న్యాప్కిన్స్ ఏర్పాటు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డాటా సేకరించారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి రెండు నెలల క్రితమే ప్రాథమిక డాటా సేకరించినట్లు కేంద్రం బదులిచ్చింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రం నిరంతరం డాటా సేకరించి, తగినచర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదిక తెప్పించుకోవాలని కోర్టు ఆదేశించింది.