తిరువనంతపురం: ఒక బాలిక, పొరుగు వ్యక్తి మూడు వారాల కిందట అదృశ్యమయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రోన్ల సహాయంతో విస్తృతంగా వెతికారు. చివరకు బాలిక ఇంటి సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న వారిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. (Missing Girl Found Dead With Neighbour) కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 11న పైవలికే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. పొరుగున నివసించే 42 ఏళ్ల ప్రదీప్ కూడా అదే రోజు నుంచి కనిపించడంలేదు. దీంతో ఫిబ్రవరి 12న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రదీప్‌పై వారు అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, బాలిక, పొరుగు వ్యక్తి ప్రదీప్ మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 52 మందితో కూడిన పోలీస్ బృందాలు పలు చోట్ల వెతికాయి. చివరకు ఆదివారం బాలిక ఇంటి సమీపంలోని ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న వారిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక, పొరుగింటి వ్యక్తి మిస్సింగ్, మృతిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.