Encounter : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘజియాబాద్ (Ghaziabad) పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ నేరగాడికి, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఇటీవల సంచలనం సృష్టించిన 17 ఏళ్ల బాలుడు సూర్యప్రతాప్ చౌహాన్ (Suryapratap Chauhan) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ (Asad) ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించిన అసద్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. తీవ్రంగా గాయపడిన అసద్ ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఆపరేషన్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి.
బక్రీద్ పండుగ రోజున ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యప్రతాప్ చౌహాన్‌ను అసద్, అతడి అనుచరులు కత్తులతో పొడిచి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ పలు హిందూ సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ కేసులో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి అయిన అసద్ పరారీలో ఉండటంతో అతడిపై రూ.50,000 రివార్డు ప్రకటించారు.
ఈ క్రమంలో అసద్ నగరం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో ఖోడా, ఇందిరాపురం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బైక్‌పై వస్తున్న అసద్‌ను ఆపేందుకు ప్రయత్నించగా.. అతడు పోలీసులపై నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరగలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటన సమయంలో బైక్‌పై ఉన్న అసద్ అనుచరుడు చీకటిని ఆసరాగా చేసుకొని పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలం నుంచి ఒక మోటార్ సైకిల్, నాటు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.