న్యూఢిల్లీ, జనవరి 9 : జన్యుసంబంధ వ్యాధులపై పరిశోధనలకు, ఔషధాల తయారీకి ఉపయోగపడే భారతీయుల జన్యు విశ్లేషణ సమాచారం అందుబాటులోకి వచ్చింది. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 10 వేల మంది దేశ ప్రజల జన్యువులను విశ్లేషించి ఈ డాటాను తయారుచేశారు. ఢిల్లీలో జరిగిన జీనోమిక్స్ డాటా కాంక్లేవ్‌లో ఈ డాటాను విడుదల చేశారు. పరిశోధకులకు ఉపయోగపడేలా ఇండియన్ బయోలాజికల్ డాటా సెంటర్(ఐబీడీసీ) పోర్టల్‌లో ఈ డాటాను అందుబాటులో ఉంచారు. భారతీయ జనాభా ప్రత్యేక జన్యు నమూనాలను అర్థం చేసుకునేందుకు ఈ డాటా కీలకమని, జన్యు జీవసాంకేతిక విజ్ఞాన పరిశోధనల్లో ఇది మైలురాయిగా నిలువనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కాంక్లేవ్‌ను ఉద్దేశించి ఆయన తన వీడియో సందేశాన్ని పంపించారు.