న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 : పాలకుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నేతల వారసుల విలాస జీవితాలు, ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు, పెరిగిపోతున్న నిరుద్యోగిత వంటి అనేక సమస్యలు యువజనులలో అసహనానికి, ఆగ్రహానికి దారితీస్తూ ప్రపంచవ్యాప్తంగా జనరేషన్ జెడ్ (Generation Z) నిరసనలకు ప్రాణం పోస్తున్నాయి. సోషల్ మీడియా వేదికలను ఆయుధంగా మలచుకున్న యువత వాట్సాప్, ఇన్‌స్టా తదితర ఫ్లాట్పామ్ల ద్వారా సమూహంగా మారి పాలకులకు దడ పుట్టిస్తున్నారు. ప్రభుత్వాలను కూల్చివేయగల శక్తిగా యువత అవతరించడం అనేక దేశాలలో ఆవిష్కృతమైంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడమేగాక ఆమెను దేశం నుంచి పారిపోయేలా చేసిన విద్యార్థి ఉద్యమం పాలకుల పట్ల యువజనులలో రగులుతున్న ఆగ్రహజ్వాలలను బయటపెట్టింది. ఆ తర్వాత నేపాల్‌లో జరిగిన జెన్-జీ విప్లవం హింసాకాండకు దారితీసి 70 మందిని బలిగొనగా చివరకు ప్రభుత్వ పతనానికి అది దారితీసింది. ఇటీవలి కాలంలో పాలకులపై యువతలో పెల్లుబుకుతున్న ఆగ్రహం వివిధ దేశాలలో గతంలో కనీవినీ ఎరుగని భారీ నిరసన ప్రదర్శనలను ఆవిష్కరిస్తోంది.
ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో ఇటీవల వేలాది మంది యువజనులు పాలకుల అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఇండొనేషియాలో సైతం ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి దేశ అభివృద్ధిని దెబ్బతీస్తోందని ఆగ్రహిస్తూ యువజనులు నిరసనలకు దిగుతున్నారు. ఈ దేశంలో ఉద్యగావకాశాలు లేవని, వేరే దేశాలకు వెళ్లి ఉపాధి పొందాలంటూ ఇండొనేషియాలో పెద్ద ఎత్తున వాట్సాప్ ఉద్యమం కొనసాగుతోంది. ఓ స్థానిక పాలకుడికి నెలకు వచ్చే అద్దె అలవెన్సు ఓ సామాన్య కుటుంబీకుడి ఆదాయం కన్నా 20 రెట్లు ఎక్కువన్న వార్తలు రావడంతో ఇండొనేషియాలోని సుమత్రాకు చెందిన ఓ 22 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థి జిక్రీ అఫ్ధినెల్ సరేగర్ ఇటీవల నిరసన ప్రదర్శన నిర్వహించాడు. యువజనులలో రాజకుంటున్న అసంతృప్తికి ఇదే నిదర్శనమని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా మొరాకోలో గత శనివారం యువజనుల సారథ్యంలో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ప్రభుత్వ అప్రాధాన్య ఖర్చులకు వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించింది. వందలాది మంది యువజనులు మొరాకోలోని 11 నగరాలలో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆరోగ్యం, విద్యను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ కోసం వందల కోట్లు ఖర్చుచేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అది వారి మధ్య ఘర్షణలకు దారితీసింది. దక్షిణ అమెరికాలోని పెరూలో పాలకుల అవినీతికి నిరసనగా సెప్టెంబర్ 27న వేలాదిమంది యువజనులు దేశ రాజధాని లిమాలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. అధ్యక్షుడు డీనా బొలువార్తే అవినీతికి ప్రశ్నించడమేగాక ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని, పారదర్శకతను నిరసనకారులు డిమాండు చేశారు. సెప్టెంబర్ 20న మొదలైన ప్రదర్శనలు 27న పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణలకు దారితీశాయి. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు, లాఠీచార్జీలను ప్రయోగించారు.
తాజాగా భారత్ కూడా జెన్-జీ ఆందోళనలను చవిచూసింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ గతవారం లద్దాఖ్‌లో భారీ స్థాయిలో యువజనుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు నిరసనకారులు మృత్యువాత పడ్డారు. లెహ్ పట్టణంలో నిరసనకారులు విధ్వంసానికి, హింసాకాండకు పాల్పడ్డారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు పోలీసు వాహనాలను దగ్ధం చేశారు. చివరకు పాలనా యంత్రాంగం కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చింది. హింసను ప్రేరేపించాడన్న ఆరోపణతో వాతావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ని ఎన్ఎస్ఏ అరెస్టు చేసింది. అస్సాంలో ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ హఠాన్మరణం ప్రజలలో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. జుబీన్ మరణంపై పలు అనుమానాస్పద కథనాలు వెలువడడం లక్షలాదిమంది ఆయన అభిమానులలో ఆగ్రహం తెప్పించింది. జుబీన్‌కు న్యాయం జరగాలంటూ వారు నిరసన గళం ఎత్తడంతో ప్రభుత్వం వెంటనే మేల్కొంది.
ఇది మరో జెన్-జీ ఆందోళనకు దారితీసే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్వ సైతం అనుమానించారు. అస్సాంను మరో నేపాల్ కానివ్వబోమని ఆయన ప్రకటించారు. జుబీన్కి న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారని, వారి ఆవేదనను తాము అర్థం చేసుకోగలమని, కాని హింసకు రాష్ట్రంలో తావు లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రపంచంలోని వివిధ దేశాలలో జరుగుతున్న తాజా జెన్-జీ ఉద్యమాల నేపథ్యంలో భారత్‌లోని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ మంత్రాన్నే పఠిస్తున్నాయి. నేపాల్ పరిణామాలు జరిగిన కొన్ని రోజులకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ మన దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు యువత ముందుకురావాలని పిలుపునిచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దేశంలో అలజడి రేపేందుకు రాహుల్ యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. భారత్‌లోని జెన్-జీ హిందూ దేశం కావాలని కోరుకుంటోందని కూడా దూబే వెల్లడించడం గమనార్హం.