జపాన్ను దాటేసి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామన్నారు. 4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఊదరగొట్టారు. 11 ఏండ్లపాలనలో మా అభివృద్ధిని చూశారా? అంటూ జబ్బలు చరుచుకొన్నారు. అయితే, ఎన్డీయే సర్కారు పాలనా ప్రతిభ ఏపాటిదో అసలు బండారం బయటపడింది.‘మేకిన్ ఇండియా’ను ‘జోకిన్ ఇండియా’గా మార్చిన వైనమేంటో తేటతెల్లమైంది. ఫలితం.. దేశ ఆర్థికాభివృద్ధికి అద్దంపట్టే స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు నాలుగేండ్ల కనిష్ఠానికి పతనమయ్యింది.
PM Modi | న్యూఢిల్లీ, మే 30/(స్పెషల్ టాస్క్ బ్యూరో): తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మారిందని మరోసారి రుజువైంది. అవును.. దేశంలో తయారీ రంగం ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. సేవా రంగం కుంటుపడిపోయింది. రియల్ ఎస్టేట్ ఢమాల్మన్నది. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, నిర్మాణం, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, మైనింగ్ ఇలా ఒక్కటేమిటీ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా పరిగణించే అన్ని రంగాలు నేలచూపులు చూస్తున్నాయి. మొత్తంగా దేశ ఆర్థికాభివృద్ధికి అద్దంపట్టే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు కుప్పకూలిపోయింది. ఎంతలా అంటే కరోనా సంక్షోభం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలకు దిగజారిపోయింది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం వెలువరించిన గణాంకాల్లో తేలింది.
ఒక దేశం అభివృద్ధికి కొలమానాలు అంకెలే. ఒక దేశ ఆర్థిక పరిమాణాన్ని, ఉత్పాదకతను స్థూలంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)గా చెప్పొచ్చు. జీడీపీ వృద్ధిరేటు బాగుంటే ఆ దేశం బాగున్నట్టు చెప్తారు. ఒకవేళ జీడీపీ వృద్ధిరేటులో మందగమనం కొనసాగితే, ఆ దేశం సమస్యలను ఎదుర్కొంటున్నట్టు లెక్క. ఇప్పుడు దేశ జీడీపీ వృద్ధిరేటును చూస్తే, అలాంటి పరిస్థితులే దాపురించినట్టు అర్థమవుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా నమోదైంది. అంటే ఏకంగా నాలుగేండ్ల కనిష్ఠానికి పతనమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే.. 9.2 శాతం నుంచి 6.5 శాతానికి దిగజారింది. అంటే ఏడాది వ్యవధిలోనే 2.7 శాతం పడిపోయింది.
ఏడాది వ్యవధిలోనే జీడీపీ వృద్ధిరేటు ఈ మేర పడిపోవడం యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులకు అద్దం పడుతున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. తయారీ రంగ కార్యకలాపాల్లో నెలకొన్న నిస్తేజం, మౌలిక రంగంలో మందగమనం మొత్తంగా భారత ఆర్థిక ప్రగతిని తీవ్రంగా అడ్డుకొన్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా దేశ జీడీపీ గణాంకాలు నిరాశాజనకంగా నమోదయినట్టు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5 శాతానికే పరిమితమైంది. ఇది నాలుగేండ్ల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఇక చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగానే ఉన్నట్టు ఎన్ఎస్వో అంచనాలు చెప్తున్నాయి. 2024-25 నామినల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) రూ.300.22 లక్షల కోట్లుగా ఉంటే.. 2023-24లో రూ.274.13 లక్షల కోట్లుగా ఉన్నది.
జీడీపీ పెరుగుదలకు కీలకమైన దాదాపు అన్ని రంగాలు గడిచిన ఆర్థిక సంవత్సరం నేలచూపులనే చూస్తున్నట్టు ఎన్ఎస్వో గణాంకాలనుబట్టి అర్థమవుతున్నది. ఏడాది వ్యవధిలోనే తయారీ రంగం వృద్ధిరేటు ఏకంగా 7.8 శాతం మేర క్షీణించింది. అంటే ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ఒక విఫల పథకంగా అర్థమవుతున్నది. జీడీపీకి కీలకమైన ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా వృద్ధిరేటులో 3.1 శాతం మేర క్షీణించాయి. విద్యుత్తు-గ్యాస్ వృద్ధిరేటు 2.7 శాతం, ట్రేడ్-రవాణా రంగాల వృద్ధిరేటులో 1.4 శాతం మేర తగ్గుదల నమోదైంది. నిర్మాణం, మైనింగ్ తదితర రంగాల్లో కూడా వృద్ధిరేటు ఒకటి, అర శాతం చొప్పున క్షీణించడంతో మొత్తంగా జీడీపీ వృద్ధిరేటు నిరుడితో పోలిస్తే 2.7 శాతం మేర మందగించింది.