హైదరాబాద్, ఫిబ్రవరి 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): శ్రీలంకలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తామన్న రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టులపై ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ వెనక్కి తగ్గారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకలోని గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ప్రాజెక్టుతో సమీపంలోని బర్డ్ కారిడార్‌పై, స్థానిక మత్స్యపరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్థానికులు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు.
ఒప్పందంలో భాగంగా చేసుకొన్న విద్యుత్తు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తాను అధికారంలోకి వస్తే అవినీతి ప్రాజెక్టులను రద్దు చేస్తానంటూ నిరుడు అనురా కుమార దిసనాయకే హామీనిచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తగ్గట్టే, అదానీ పవన విద్యుత్తు ప్రాజెక్టులపై శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే దృష్టిసారించారు. డీల్ జరిగిన విధానం, విద్యుత్తు ఛార్జీలపై నిర్ణయంపై అదానీ కంపెనీ ప్రతినిధులతో పునఃసమీక్ష చేయాల్సిందిగా కెయ్లాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ కొలంబో అధికారులను ఆదేశించారు. అధికారులు ఈ చర్యలకు సమాయత్తమవుతుండగానే.. తాము ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్టు అదానీ కంపెనీ ప్రకటించడం చర్చనీయాంశమైంది.