Gaurav Gogoi : బీజేపీ మంత్రులు తమ వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ ఆరోపించారు. గగోయ్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత రెండు నెలల్లో నాలుగు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదాల్లో 14 మంది మరణించినా రైల్వే శాఖ మంత్రి ఎలాంటి నైతిక బాధ్యత వహించలేదని అన్నారు. నైతిక బాధ్యత వహించకపోగా రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ విపక్షాల మీద విరుచుకుపడుతున్నారని ఎద్దేవా చేశారు.
గత ఏడాది బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. గత ఒకట్రెండు సంవత్సరాలుగా రైలు ప్రమాదాలు పెరుగుతున్నా రైల్వే మంత్రి మాత్రం తనకేమీ పట్టనట్టు రీల్స్ చేయడంలో మునిగిపోయారని విమర్శించారు. ఆయన రైల్వే మంత్రి కాదని రీల్ మినిస్టర్, డిరైల్మెంట్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు.
దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోకపోవడం బీజేపీ సంప్రదాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రమాదాలపై మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన సంతృప్తికరంగా లేదని, జవాబుదారీతనం నుంచి ఆయన పారిపోతున్నారని అన్నారు. అందుకే విపక్ష ఇండియా కూటమి పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ పేర్కొన్నారు.
Read More :