న్యూఢిల్లీ : కుండపోతతో పట్నాలో గంగా నది ఉధృతంగా ప్రమాద స్ధాయిని మించి ప్రవహిస్తోంది. వరద తాకిడికి కృష్ణ ఘాట్ సహా ఇతర ఘాట్లు మునిగిపోయాయి. వరద పరిస్థితిపై స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద పోటెత్తడంతో పూజలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వరద తాకిడితో నీళ్లు కలుషితమయ్యాయని స్ధానికులు వాపోతున్నారు. నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇక్కడ బట్టలు ఉతికేందుకు కష్టమవుతోందని స్ధానిక రజకులు పేర్కొన్నారు.
మరోవైపు పూజ కోసం గంగా జలం సేకరించేందుకు వచ్చే భక్తులు వరదలతో నీరు మురికిగా మారిందని అయినా పూజ కోసం తప్పడం లేదని పేర్కొంటున్నారు. ఇక మరికొన్ని రోజులు బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తాయనేందుకు సంకేతంగా భారత వాతావరణ విభాగం యల్లో అలర్ట్‌ను జారీ చేయడంతో స్ధానికుల్లో ఆందోళన రేకెత్తుతోంది. ఇక వరద ఉధృతితో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరుతున్నారు.