త్రిసూర్: మూడు కార్లలో మరో కారును వెంబడించారు. రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో ఆ కారును అడ్డగించారు. కత్తులు, గొడ్డళ్లతో అందులో ఉన్నవారిని బెదిరించి కారుతో సహా వారిని ఎత్తుకెళ్లారు. వారివద్ద ఉన్న రూ.1.82 కోట్ల విలువైన బంగారాన్ని (Gold Robbery) దోపిడీచేశారు. అనంతరం వారిని వదిలేశారు. అచ్చం సినిమాల్లోలానే.. అంతా చూస్తుండగా ఈ భారీ చోరీ కేరళలోని త్రిసూర్‌లో బుధవారం చోటుచేసుకున్నది.
అరుణ్ సన్నీ అనే వ్యాపారి రోజీ థామస్ అనే వ్యక్తితో కలిసి 2.5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని కారులో కోయంబత్తూరు నుంచి త్రిసూర్‌కు బయలుదేరారు. ఉదయం 11 గంటల సమయంలో కుతిరన్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో అరుణ్ వాహనాన్ని వెంబడించారు. ఆ తర్వాత కత్తులు, గొడళ్లతో బెదిరించి కారు నుంచి బయటకు రప్పించారు. క్షణాల్లో కారులో ఉన్న 2.5 కిలోల బంగారాన్ని లాక్కున్నారు. అరుణ్‌ను కూడా కారులో ఎక్కించుకుని.. నాలుగు కార్లలో పరారయ్యారు. ఆ తర్వాత వారిని వదిలేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితులు తమ వద్ద ఉన్న రూ.1.84 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారని ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. దొంగల కారును పుత్తూరులోని మెకానిక్ షెడ్లో ఉన్నట్లు కనుగొన్నారు. విచారణలో మిగతా కార్ల నంబర్ ప్లేట్లు నకిలీవని గుర్తించారు. దొంగల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
2.5 kg gold, being transported by car from Coimbatore to Thrissur, was stolen by a gang in three vehicles. #goldrobbery https://t.co/ciGUO7fW7u pic.twitter.com/qBIcZyGnuW
— Onmanorama (@Onmanorama) September 26, 2024