కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 7: పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతో విసిగిపోయిన పలువురు మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారుల ఎదుట 51 మంది మావోయిస్టులు సాయుధంగా శనివారం లొంగిపోయారు. వీరిపై రూ.85 లక్షల రివార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సుక్మా జిల్లా పోలీస్ అధికారుల ఎదుట 21 మంది మావోయిస్టులు సాయుధంగా లొంగిపోయారు. వీరిపై రూ.76 లక్షల రివార్డులు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టులందరికీ తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున నగదును చెక్కు రూపంలో పోలీస్ అధికారులు అందజేశారు.
మరోవైపు గరియా బంద్ జిల్లా అటవీ ప్రాంతంలో నిర్వహించిన సెర్చింగ్ ఆపరేషన్లో కొండల్లో ఆరు చోట్ల మావోయిస్టుల డంపును భద్రతా దళాలు శనివారం స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక 303 రైఫిల్, ఒక నాటు తుపాకీ, ఒక నాటు బారెల్ గ్రనేడ్ లాంచర్(బీజీఎల్), రెండు 12 బోర్ గన్స్, రెండు సింగిల్ షార్ట్ వెపన్స్, 127 లైవ్ బుల్లెట్లు, 8 మ్యాగజైన్లు, 22 బీజీఎల్ షెల్స్ ఉన్నాయి.