న్యూఢిల్లీ, జనవరి 28 : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ(ఐఐటీ-ఢిల్లీ)కి చెందిన దాదాపు 10,000 మంది పూర్వ విద్యార్థులు బ్యాంకింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. ఫ్లిప్కార్ట్, జొమాటో వ్యవస్థాపకుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఐఐటీ-ఢిల్లీకి చెందిన పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఈ వివరాలను ఐఐటీ-ఢిల్లీ తన మొట్టమొదటి పూర్వ విద్యార్థుల నివేదికలో వెల్లడించింది. దేశంలోను, వెలుపల తన 65,000 పైచిలుకు పూర్వ విద్యార్థులు పారిశ్రామిక, ప్రభుత్వ, విద్యా రంగాల్లో నిర్వహిస్తున్న కీలక పాత్రకు సంబంధించిన వివరాలను సంస్థ తెలియచేసింది.