Stampedes | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Kumbh Mela)లో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నేడు మౌనీ అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అక్కడే ఉన్న బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట (Stampede) జరిగింది.
సంగమం వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 20 మంది మృతిచెందినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం మరణాలను ధ్రువీకరించలేదు. సుమారు 50 మందికిపైగా భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన కుంభమేళాలో గతంలో కూడా అనేక తొక్కిసలాట ఘటనలు జరిగాయి. ఆయా ఘటనల్లో అనేక మంది భక్తులు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కుంభమేళాల సందర్భంగా గతంలో జరిగిన ‘మహా’ విషాదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘మహా’ విషాదాలు..!
1954.. స్వాతంత్య్రం తర్వాత జరిగిన మొట్టమొదటి కుంభమేళా. ఆ కుంభమేళా చరిత్రలో నిలిచిపోయే విషాదాంతమైంది. 1954 ఫిబ్రవరి 3 అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో జరిగిన కుంభమేళాకు మౌనీ అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో దాదాపు 800 మందికిపైగా మరణించి ఉంటారని అంచనా.
ఆ తర్వాత 1986లో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా కూడా విషాదాంతమైంది. అప్పటి యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్.. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి హరిద్వార్‌కు వచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది సాధారణ ప్రజలను నదీతీరాల్లోకి రానీకూండా ఆంక్షలు విధించారు. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. భక్తులు ఒక్కసారిగా సిబ్బందిని దాటుకుంటూ నదీ తీరంవైపు చొచ్చుకురావడంతో తొక్కిసలాటకు దారి తీసింది. ఈ దుర్ఘటనలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు.
2003లో కూడా ఇదే సీన్ రిపీటైంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాల కోసం వేలాది మంది యాత్రికులు గోదావరి నది వద్ద గుమి గూడారు. ఆ సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మహిళలు సహా కనీసం 39 మంది మరణించారు. దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు.
అదేవిధంగా.. 2013 ఫిబ్రవరి 10న కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. అక్కడ ఉన్న పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో భయాందోళనకు గురైన యాత్రికులు పరుగులుతీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోగా, 45 మంది గాయపడ్డారు.
Also Read..
Maha Kumbh Mela | మౌనీ అమావాస్య.. భక్తులతో కిక్కిరిసిన ప్రయాగ్‌రాజ్.. VIDEOS
PM Modi: ప్రయాగ్‌రాజ్ ఘటన చాలా బాధాకరమైంది: ప్రధాని మోదీ
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 40 మందికి పైగా గాయాలు