మాదాపూర్, ఆగస్టు 2: లోన్స్ ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసిన వారిని శుక్రవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ సద్దాన్ అన్సారీకి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నూతనంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే వారిపై గురి పెట్టాడు. వ్యాపారానికి అవసరమైన లోన్స్ ఇస్తానంటూ నమ్మించాడు.
ఇందుకు ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి పధకం గురించి వివరించాడు. దీంతో మహమ్మద్ సద్దాన్ అన్సారీ గోవాలో ఓ ఖరీదైన భవనాన్ని అద్దెకు తీసుకొని దుర్గేశ్ శుక్లా, ప్రతిభ అగ్నిహోత్రి, ప్రశాంత్ సుధీర్, షాదీ అహ్మద్ సిద్దీఖీక్, నవనీత్ వర్మ, కిరణ్ కుమార్ శర్మ, సరా సహయ్, జయంత చట్టర్జీ, అరవింద్, జుగాలి మసురేకర్, అమ్నా అన్సారీ, ప్రియాంక దీక్షిత్‌తో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించాడు. రుణాలు ఇప్పిస్తామంటూ తెలిసిన వారితో ప్రచారం మొదలు పెట్టారు. మహమ్మద్ సద్దాన్ అన్సారీ వ్యాపారంలో రాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే మాదాపూర్‌లోని కాకతీయహిల్స్‌లో నివాసం ఉంటున్న బాధితుడు కోడిలి శ్రీకాంత్ చౌదరీ ఈ గ్యాంగ్‌ను సంప్రదించాడు. తాను పెట్టే వ్యాపారానికి రూ. 150 కోట్లు కావాలని బాధితుడు కోరాడు. బాధితుడి వద్ద నుంచి రూ. 1.5 కోట్లను తీసుకున్నారు. ఆ తరువాత బాధితుడికి ఎటువంటి రుణం అందించకుండా కాలయాపన చేశాడు. చివరకు ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ సద్దాన్ అన్సారీ, షాజీ అహ్మద్ సద్దిఖీలను పట్టుకున్నారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.