(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : దేశంలో మహిళలకు భద్రత లేకుండాపోతున్నది. దేశంలో ఎక్కడో ఓ చోట సగటున ప్రతీ గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2023 వరకూ అంటే పదేండ్లలో దేశంలోని 3,20,196 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలను విశ్లేషిస్తే అర్థమవుతున్నది. బీజేపీపాలిత రాష్ర్టాల్లోనే మహిళలపై ఎక్కువగా లైంగిక దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
దేశంలో రేప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్-5 రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉండటం గమనార్హం. ఏడాదికి సగటున 5 వేలకు పైగా కేసులతో రాజస్థాన్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా, 2017 నుంచి 2022 మధ్యలో దేశంలో రోజూ సగటున 86 రేప్ కేసులు నమోదయ్యాయని న్యూస్18 ఇంగ్లిష్ వెబ్సైట్ ఓ కథనంలో వెల్లడించింది.
వీటిల్లో సగటున 82 కేసుల్లో బాధితురాలికి తెలిసిన వాళ్లే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు వివరించింది. 18-30 ఏండ్ల మధ్య వయసున్న వారిపైనే 65 శాతం మేర లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపింది. పని చేసే దగ్గర కూడా మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నట్టు ఎన్సీఆర్బీ నివేదికను బట్టి అర్థమవుతున్నది. 2014 నుంచి 2022 మధ్య ఈ తరహా కేసులు 4,231 వరకు నమోదైనట్టు రికార్డులను బట్టి తెలుస్తున్నది.
రేప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్-5 రాష్ర్టాలు : రాజస్థాన్ (1), ఉత్తరప్రదేశ్ (2), మధ్యప్రదేశ్ (3), మహారాష్ట్ర (4), హర్యానా (5)