కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 17 : మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా నార్త్‌వెస్ట్ రీజియన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్), జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్జీ), కోబ్రా బలగాల సంయుక్త ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య సుమారు గంటన్నరపాటు భీకర పోరు జరిగినట్టు తెలిసింది.
జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపు చర్యలు చేపట్టగా.. ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఒక ఏకే-47, ఇతర ఆయుధ, వస్తు సామగ్రి లభించింది. మృతుల్లో ఒకరు డివిజనల్ కమిటీ సభ్యుడు, నేషనల్ పార్క్ ఏరియా దళ కమాండర్ దిలీప్ బెడ్జా, ఏరియా కమిటీ మెంబర్ కోసా మాండవిగా పోలీసులు గుర్తించారు. ఎదురుకాల్పుల ఘటనతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆ ప్రాంతంలో మరిన్ని భద్రతా బలగాలను మోహరించి గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.