Timber smuggling | ఆసోం-మేఘాలయ సరిహద్దులో కాల్పులు కలకలం రేపాయి. ఈ కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. కాల్పులుపై ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే, కలప స్మగ్లింగ్ చేస్తున్న ట్రక్కును అడ్డుకోవడం వల్లనే కాల్పులు జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. చనిపోయిన వారిలో ఒక ఫారెస్ట్ గార్డు, ముగ్గురు ఖాసీ వర్గీయులు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేఘాలయలోని పశ్చిమ జయంతియా హిల్స్‌లోని ముక్రోహ్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాల్పుల జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును పోలీసులు అడ్డుకోవడంతో కాల్పులు జరిపారు. స్మగ్లింగ్ ముఠా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించింది.
పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారని పశ్చిమ కర్బీ ఆంగ్లోంగ్ ఎస్పీ ఇమ్దాద్ అలీ చెప్పారు. అక్రమ కలపతో వెళ్తున్న ట్రక్కును అటవీశాఖ అడ్డగించడంతో కాల్పులు జరిగినట్లు ఆయన తెలిపారు. చనిపోయిన వారిలో ఒకరిని ఫారెస్ట్ గార్డ్ బిద్యాసింగ్ లేఖ్తేగా గుర్తించారు. ఇలాఉండగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో మాత్రం కాల్పులు రెండు గ్రూపుల మధ్య జరిగినట్లుగా తెలుస్తున్నది. అసోం-మేఘాలయ సరిహద్దు వెస్ట్ కర్బీ అంగ్లాంగ్లోని జిరికిండింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు ఖాసీ వర్గానికి చెందిన వారున్నారు.