న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాకు వెళ్తున్న నలుగురు గుజరాతీలు ఇరాన్లో కిడ్నాప్‌నకు గురయ్యారు. రూ.2 కోట్లు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు గుజరాత్‌లోని మాన్సా నియోజకవర్గానికి చెందినవారు. మాన్సా ఎమ్మెల్యే జయంతి పటేల్ స్పందించి, వీరిని కాపాడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఈనెల 26న లేఖ రాశారు. ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఈనెల 19న ఢిల్లీ నుంచి ఎమిరేట్స్ విమానంలో బయల్దేరారని తెలిపారు.
వీరిని టెహ్రాన్‌లో గుర్తు తెలియని చోటుకు తీసుకెళ్లి హింసిస్తున్నారని చెప్పారు. బాధితుల బంధువుల కథనం ప్రకారం, దుండగులు పంపించిన వీడియోలలో, వీరి కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ అంటించి, తీవ్రంగా కొడుతున్నట్టు తెలుస్తున్నది. ఇదిలావుండగా, ఈ నలుగురు గుజరాతీలు ఆస్ట్రేలియాకు చట్టవిరుద్ధంగా వెళ్తున్నట్లు సమాచారం.