Heat stroke : భానుడు భగ్గున మండుతుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మండుటెండల కారణంగా వడదెబ్బ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో వడదెబ్బ మృతుల సంఖ్య 50 దాటింది. బీహార్‌లో అత్యధికంగా 32 మంది మరణించారు. తాజాగా ఒడిశాలో నలుగురు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు.
గురువారం సాయంత్రం 50 మంది వడదెబ్బ తగిలి ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోగల రూర్కెలా ప్రభుత్వ దవాఖానలో చేరారు. చికిత్స పొందుతూ వారిలో నలుగురు శుక్రవారం ఉదయం మరణించారు. మిగిలిన వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఎండ తీవ్రత ఇంకా పెరుగుతుండటంతో ముందుముందు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.