న్యూఢిల్లీ, జూలై 23: నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరిలో ముగ్గురిని గుజరాత్లో, మరొకరిని వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. దొంగ నోట్ల రాకెట్ నడుపుతున్న వీరు.. వివిధ సామాజిక మాధ్యమాలు, కొన్ని అనుమానాస్పద యాప్‌ల సహాయంతో అల్‌ఖైదా భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
తాము జరిపిన సంభాషణల ఆనవాళ్లు తెలియకుండా వీరు ఆటో క్లీన్ యాప్‌లను వినియోగిస్తున్నారు. వీరికి చాలానాళ్లుగా అల్‌ఖైదాతో సంబంధాలున్నట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుండగా ఏటీఎస్ వీరిని పసిగట్టి అరెస్ట్ చేసిందని చెప్పారు.